సొర చేప తప్పించుకుందా..?
డామిట్ కథ అడ్డం తిరుగుతోందా..?
సస్పెన్షన్ పేరుతో చేతులు దులుపుకున్నారా..?
డివిజనల్ మేనేజర్‌పై చర్యలు శూన్యమా..?
అటవీశాఖలో అవినీతి కథ వెనుక కమామీషు వేరేనా..?
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) కొత్తగూడెం డివిజన్‌లో లంచం వ్యవహారం సంచలనంగా మారుతోంది. ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ అధికారుల విషయంలో చర్యలు తూతూ మంత్రంగా మారాయా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్లాంటేషన్ మేనేజర్ తాడి రాజేందర్, కాంట్రాక్టర్ గుమస్తాను దాడి జరిగిన రోజే రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం. అదే సమయంలో కొత్తగూడెం డివిజనల్ మేనేజర్ తాటి శ్రావణి పరారీలో ఉన్నారని ఏసీబీ అధికారులు మీడియా ముందే వెల్లడించారు. అయితే, సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో మాత్రం ఇద్దరు అధికారులనే సస్పెండ్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ముగ్గురు ఏసీబీ దాడుల్లో చిక్కినప్పుడు ఇద్దరినే రిమాండ్ చేసి, కీలకమైన డివిజనల్ మేనేజర్‌ను ఎలా వదిలేశారన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
పై అధికారులకు మినహాయింపులా..?
కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుని, పై స్థాయి అధికారులను కాపాడుతున్నారన్న ఆరోపణలు ఇప్పుడు బలపడుతున్నాయి. చిన్న చేపలకే శిక్షలు వేసి, పెద్ద తిమింగలాన్ని వదిలేసినట్లుగా వ్యవహారం సాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సస్పెన్షన్ ఉత్తర్వులతోనే ఉన్నతాధికారులు చేతులు దులుపుకున్నారా..? అసలు పరారీలో ఉన్న డివిజనల్ మేనేజర్‌పై ఎందుకు స్పష్టమైన చర్యలు లేవన్న ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు లేవు. ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందో..? నిజంగా బాధ్యులెవరో బయటపడుతుందో..? లేక డామిడ్ కథలా అడ్డం తిరుగుతుందో వేచి చూడాల్సిందే.


