పంట వ్యర్థాలతోనే భూమికి రక్ష
పర్యావరణ సంరక్షణకు బయోచార్
కలెక్టర్ జితేష్ పాటిల్
కాకతీయ, కొత్తగూడెం : భూమి ఆరోగ్య పరిరక్షణకు, పర్యావరణ సంరక్షణకు బయోచార్ వినియోగం కీలకమని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. చుంచుపల్లి మండలం గరిమెళ్ళపాడు నర్సరీ ఆవరణలో ఆధునిక పర్యావరణహిత వ్యవసాయ పద్ధతులపై బయోచార్ వినియోగంపై మంగళవారం ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ బయోచార్ నిపుణులు పరశురం కైలాస్ అఖరే ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం జరిగిందన్నారు. జిల్లాలో విస్తారంగా లభ్యమయ్యే పత్తి కట్టెలు, మొక్కజొన్న చొప్ప వంటి పంట వ్యర్థాలను ఉపయోగించి తక్కువ ఖర్చుతో బయోచార్ తయారు చేసే విధానాన్ని ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా రైతులకు అవగాహన కల్పించినట్లుగా తెలిపారు. ప్రత్యేకంగా ఇనుముతో తయారుచేసిన పరికరంలో పంట అవశేషాలను నియంత్రిత ఉష్ణోగ్రత వద్ద కాల్చి నాణ్యమైన బయోచార్ ఉత్పత్తి చేసే విధానాన్ని నిపుణులు వివరించినట్లుగా పేర్కొన్నారు.
అనంతరం తయారైన బయోచార్‌ను గోమూత్రం, ఆవు పేడ మిశ్రమంలో 15 రోజుల పాటు ఉంచి సక్రియం(యాక్టివేషన్) చేసి ఎరువుగా వినియోగించే విధానాన్ని వివరించారు. ఈ విధానం వల్ల నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూమి సారవంతత మెరుగుపడటంతో పాటు తేమ నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, గ్రామ సర్పంచ్ వాడే రాములు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పద్మ, ఎన్ఎస్ఎస్ అధికారులు వేముల కామేశ్వరరావు, శ్రీదేవి, ఎన్సిసి ఇంచార్జ్ ధర్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రమేష్, రాంబాబు, బూర్గంపాడు, టేకులపల్లి, చండ్రుగొండ, పాల్వంచ, దుమ్ముగూడెం, జూలూరుపాడు, గుండాల మండలాల ఎంపీడీవోలు అధ్యాపకులు రాజ్ కుమార్, సూపర్డెంట్ విజయ్ ప్రసాద్, వార్డు మెంబర్లు, విద్యార్థులు రైతులు తదితరులు పాల్గొన్నారు.


