సీఎం కప్‌కు రెడీ కావాలి!
గ్రామాల నుంచే క్రీడా ప్రతిభ వెలికితీత లక్ష్యం
ఐదు దశల్లో సీఎం కప్ పోటీలు
ప్రచారం, నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్
కాకతీయ, కొత్తగూడెం : జిల్లాలో సీఎం కప్ క్రీడా పోటీలను సజావుగా, విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు తక్షణమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం క్లస్టర్ ఇన్‌చార్జీలు, ఎంఈఓలు, డీఈవో, డీపీఓలు, సంబంధిత శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన కీలక సూచనలు చేశారు. మారుమూల గ్రామాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి, వారికి అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించడమే సీఎం కప్ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. గ్రామీణ యువతకు క్రీడల ద్వారా కొత్త అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఐదు దశల్లో సీఎం కప్ పోటీలు
సీఎం కప్ క్రీడా పోటీలు మొత్తం ఐదు దశలుగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
గ్రామ పంచాయతీ స్థాయి పోటీలు ఈ నెల 17 నుంచి 22 వరకు, మండల స్థాయి పోటీలు 28 నుంచి 31 వరకు, నియోజకవర్గ స్థాయి పోటీలు ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు, జిల్లా స్థాయి పోటీలు ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు జరుగుతాయని తెలిపారు. ఈ దశల్లో గెలిచిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారని చెప్పారు. రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలు ఫిబ్రవరి 19 నుంచి 26 వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు వివరించారు. గ్రామస్థాయిలో పోటీల నిర్వహణ కోసం జిల్లాను 77 క్లస్టర్లుగా విభజించినట్లు తెలిపారు. గ్రామీణ స్థాయిలో కబడ్డీ, వాలీబాల్, ఖో–ఖో పోటీలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎంఈఓలు, సీఆర్పీలు, పంచాయతీ సెక్రటరీలు సమన్వయంతో పనిచేసి పోటీలను విజయవంతం చేయాలని ఆదేశించారు. సర్పంచులు, ఉపసర్పంచులు, ప్రజాప్రతినిధులను భాగస్వాములుగా చేసుకోవాలని సూచించారు.
మైదానాలు, ప్రచారం కీలకం
నియోజకవర్గ స్థాయిలో వాలీబాల్, ఖో–ఖో, కబడ్డీతో పాటు ఫుట్‌బాల్ పోటీలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో మొత్తం 21 రకాల క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో సీఎం కప్ పోటీలపై విస్తృత ప్రచారం చేపట్టాలని, క్రీడాకారులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. క్రీడాకారులు satg.telangana.gov.in/cmcup వెబ్‌సైట్ లేదా CM Cup మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి గ్రామంలో కనీసం రెండు మైదానాలు సిద్ధం చేయాలని, ఒకటి బాలురకు, మరోటి బాలికల పోటీలకు వినియోగించాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారులకు అవకాశాలు కల్పిస్తున్నామని, విద్యార్థులు, యువకులు సహా అన్ని వయసుల క్రీడాకారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ పిలుపునిచ్చారు.


