భక్తి మార్గం ప్రతి ఒక్కరూ అనుసరించాలి
: మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్
కాకతీయ, కారేపల్లి : కారేపల్లి మండల పరిధిలోని భాగ్యనర్ తండా బొట్రాస్ కుంట వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో గత 41 రోజులుగా కఠోర దీక్షలో ఉన్న అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ ఇరుముడి కార్యక్రమానికి మాజీ వైర శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అయ్యప్ప స్వాములు తీసుకునే దీక్ష అనేది భక్తి, క్రమశిక్షణ, ఆత్మనియంత్రణకు ప్రతీక అని అన్నారు. కఠోర నియమాలతో, పవిత్రమైన జీవన విధానంతో దీక్షను పూర్తి చేసే స్వాములు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి మార్గాన్ని ఎంచుకుని, ఆధ్యాత్మిక విలువలను అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రావురి శ్రీనివాసరావు, మండల నాయకులు అజ్మీర వీరన్న, గుగులోత్ సురేష్‌తో పాటు అయ్యప్ప స్వాములు భూక్య కిషన్ గురు స్వామి, భూక్య రాం కిషోర్ స్వామి, గుగులోత్ హారు స్వామి, బానోత్ రాజేష్ స్వామి, గుగులోత్ సాయి స్వామి, బానోత్ హున్య స్వామి, మధు స్వామి, కల్యాణ్ స్వామి, బానోత్ సురేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఇరుముడి కార్యక్రమంతో ఆలయ ప్రాంగణం భక్తి నామస్మరణలతో మార్మోగింది.


