కిరాయికి ఉంటామని..ఇంటిని కబ్జా చేశారు
నకిలీ డాక్యుమెంట్లు.. ఫోర్జరీ సంతకాలతో కాజేసే కుట్ర
నా భర్తను మద్యానికి అలవాటు చేసి మోసం చేశారు
ఇంటి ముందే పిల్లలతో దీక్ష చేపట్టిన మహిళ
పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వినతి
రఘునాథపాలెం మండలకేంద్రం ఇందిరానగర్‌లో ఘటన
కాకతీయ, రఘునాథపాలెం : ఫోర్జరీ సంతకాలు, నకిలీ దస్తావేజులు సృష్టించి తమ ఇంటిని కాజేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల కేంద్రంలోని ఇందిరా నగర్ కాలనీకి చెందిన సంధ్య అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాకు వ్యతిరేకంగా తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటి ముందే సంధ్య దీక్షకు దిగారు. సంధ్య తెలిపిన వివరాల ప్రకారం.. 2011లో జీవనోపాధి కోసం భర్తతో కలిసి హైదరాబాద్ వెళ్లిన సమయంలో కొల్లి రామకృష్ణ, కొల్లి పవన్, కత్తి భాస్కర్ అనే ముగ్గురు తన భర్తను మద్యానికి, విలాసాలకు అలవాటు చేశారని ఆరోపించారు. ఆ సమయంలో రూ.38 వేల అప్పు ఇచ్చినట్లు చెప్పి, అప్పు పూర్తిగా తీర్చేవరకు ఇంట్లో కిరాయిదారులుగా ఉంటామని నమ్మబలికారని తెలిపారు.

ఖాళీ ప్రామిసరీ నోటుతో మోసం
అప్పు విషయమై నమ్మబలికి తనతో ఖాళీ ప్రామిసరీ నోటుపై సంతకం తీసుకున్నారని, ఆ సంతకాన్ని రూ.50 బాండ్ పేపర్‌పై కంప్యూటర్ ద్వారా ఎడిటింగ్ చేసి నకిలీ బాండ్ పేపర్ తయారు చేశారని సంధ్య ఆరోపించారు. అంతేకాదు, దొంగ సాక్షుల సంతకాలు పెట్టి తమ 68 గజాల ఇంటిని విక్రయించినట్లు చూపిస్తూ కాజేయడానికి ప్రయత్నిస్తున్నారని వాపోయారు. ఇల్లు అప్పగించకపోతే మీ అంతు చూస్తామని కొంతమంది వ్యక్తులను పంపించి బెదిరింపులకు పాల్పడుతున్నారని సంధ్య ఆవేదన వ్యక్తం చేశారు. తాము తీసుకున్న అప్పును తిరిగి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, వినకుండా నకిలీ డాక్యుమెంట్ల ఆధారంగా ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని, ఫోర్జరీ పత్రాలు తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పిల్లలతో కలిసి రోడ్డున కూర్చొని దీక్ష చేయాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


