విద్యార్థులున్నా ఉపాధ్యాయుల్లేరు..!
94 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులే
ఇద్దరిపైనే ప్రభుత్వ పాఠశాలలో బోధన భారం
నగరం నడిబొడ్డున ఉన్న పాఠశాలలో ఇదీ పరిస్థితి
విద్యాశాఖ నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం
ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్
కాకతీయ, ఖమ్మం : ఖమ్మం పట్టణంలోని బుర్హాన్‌పురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా మారింది. మొత్తం 94 మంది విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాలలో కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో బోధన నాణ్యత దెబ్బతింటోందని, విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందన్న కారణంతో కొన్ని చోట్ల స్కూళ్లను మూసివేస్తున్న పరిస్థితి ఉన్నా, నగర కేంద్రంలోనే విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలలో టీచర్లను కేటాయించకపోవడం విడ్డూరమని విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి.
నలుగురు ఉండాల్సిన చోట.. ఇద్దరే..!
గత నెలలో ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలు పదవీ విరమణ పొందడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. నిబంధనల ప్రకారం కనీసం నలుగురు ఉపాధ్యాయులు అవసరమైన పాఠశాలలో కేవలం ఇద్దరితోనే తరగతులు నిర్వహించడం అసాధ్యమని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఒక్కో ఉపాధ్యాయుడిపై అధిక భారం పడటంతో విద్యార్థులకు సరైన శ్రద్ధ చూపడం కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం పట్టణంలోనే ఈ పరిస్థితి ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చని విద్యార్థి సంఘ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో మౌలిక వసతులు కల్పిస్తున్నప్పటికీ, ఉపాధ్యాయుల కొరత ఆ లక్ష్యాన్ని నీరుగారుస్తోందని వారు విమర్శించారు.
నలుగురు ఉపాధ్యాయులు అవసరమైన ఈ పాఠశాలకు వెంటనే మరో ఇద్దరిని కేటాయించాలని, లేకపోతే ఆందోళన కార్యక్రమాలకు దిగుతామని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి.


