మహిళలకు చెక్కుల పంపిణీ
కాకతీయ, కొత్తగూడెం : పాల్వంచ నవ లిమిటెడ్ సామాజిక కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. తాటి ఆకుల కళాకృతుల విక్రయం, యూనిఫార్ముల కుట్టుదల ద్వారా వచ్చిన రూ.1,21,600 నగదును చెక్కు రూపంలో రమా దేవినేని మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా రమా దేవినేని మాట్లాడుతూ, మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబంతో పాటు సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేస్తే ఆ కుటుంబం ఎప్పుడూ ఆనందమయంగా ఉంటుందని అన్నారు. మహిళా సాధికారతకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరుణ, దివ్యతో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.


