అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి!
రోడ్ విస్తరణ పేరుతో విగ్రహం తొలగింపు అవమానం
తగిన స్థలం కేటాయించాలని కలెక్టర్‌కు వినతి
బీజేపీ జిల్లా నాయకుడు గుండా ఉపేందర్‌రెడ్డి డిమాండ్
కాకతీయ, కూసుమంచి : కూసుమంచి మండల కేంద్రంలో డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా నాయకుడు గుండా ఉపేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. రోడ్ విస్తరణలో భాగంగా ప్రధాన కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన అధికారులు, ఆ తరువాత విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించడం రాజ్యాంగ నిర్మాతకు అవమానమని ఆయన మండిపడ్డారు. సోమవారం ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. బడుగు, బలహీన వర్గాల కోసం అహర్నిశలు శ్రమించి భారత ప్రజాస్వామ్యానికి పునాదులు వేసిన భారతరత్న డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని మండల కేంద్రంలో తగిన స్థలంలో ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుతం మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి దుర్గంధం వెదజల్లుతున్నాయని, కనీసం ఆయన జయంతి, వర్ధంతి రోజుల్లో నివాళులు అర్పించేందుకు కూడా సరైన మార్గం లేకపోవడం బాధాకరమని వినతిపత్రంలో పేర్కొన్నారు. అలాగే స్థానిక పోలీస్ స్టేషన్ పక్కన విగ్రహం ఉండటంతో అక్కడ వాహనాల పార్కింగ్ సమస్య ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.స్వంత నిధులతో ఏర్పాటు చేయదలచుకున్న డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కాంస్య విగ్రహానికి తగిన స్థలం కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మంద చంద్రశేఖర్ గౌడ్, అడపా శివ, దామళ్ల కోటి తదితరులు పాల్గొన్నారు.


