వాహనం ఢీ కొట్టడంతో బైటపడ్డ గంజాయి
మూడు సంచుల్లో 18–20 కేజీల గంజాయి స్వాధీనం
వ్యక్తి అరెస్ట్.. మరోకరు పరారీ
కాకతీయ, మణుగూరు/బూర్గం పహాడ్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భూర్గంపహాడ్ మండలం సారపాక సెంటర్ వద్ద భారీగా గంజాయి తరలింపు ఘటన వెలుగులోకి వచ్చింది. సుమారు 18 నుంచి 20 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై మూడు సంచుల్లో గంజాయిని తరలిస్తూ అతివేగంగా వెళ్తుండగా, సారపాక సెంటర్ వద్ద ఎదురెదురుగా వచ్చిన వాహనంతో ఢీ కొట్టారు. ప్రమాదం కారణంగా బైక్‌పై ఉన్న సంచులు రోడ్డుపై పడిపోవడంతో లోపల ఉన్న గంజాయి బయటపడింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని పరిశీలించగా సంచుల్లో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందడంతో వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పోలీసులను గమనించిన ఇద్దరిలో ఒకరు పరారవగా, మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తిని విచారిస్తున్న పోలీసులు, ఈ గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారన్న వివరాలను సేకరిస్తున్నారు. పరారైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.


