అమెరికా దురాక్రమణపై ప్రపంచం గళమెత్తాలి
ట్రంప్ సామ్రాజ్యవాద అహంకారాన్ని ఖండించాలి
వెనుజువేలాపై సహజ సంపదల కోసమే యుద్ధం
సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్
ట్రంప్ దిష్టిబొమ్మ దహనం
కాకతీయ, తుంగతుర్తి : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దురాహంకార వైఖరితో సాటి దేశమైన వెనుజువేలాపై అర్ధరాత్రి బాంబుల వర్షం కురిపిస్తూ దురాక్రమణకు పాల్పడటాన్ని యావత్ ప్రపంచ ప్రజలు తీవ్రంగా ఖండించాలని సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి ఎక్స్‌రోడ్డు వద్ద ఉన్న జ్యోతిబాపూలే విగ్రహం సమీపంలో సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ తుంగతుర్తి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అమెరికా దురాక్రమణను ఖండిస్తూ ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ… వెనుజువేలా దేశం తమ దేశంలోకి మత్తు పదార్థాలు రవాణా చేస్తోందన్న నెపంతో అమెరికా దాడి చేయడం పూర్తిగా అబద్ధమని విమర్శించారు. వాస్తవానికి వెనుజువేలాలో ఉన్న చమురు, బంగారం వంటి సహజ ఖనిజ సంపదలను దోచుకునేందుకే ట్రంప్ ఈ కుట్ర పన్నాడన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల సహజ వనరులు, మానవ వనరులను కొల్లగొట్టడంలో అమెరికా అధ్యక్షుడు అందవేసిన చేయి అని ఆరోపించారు.
ప్రజాస్వామ్యానికి ముప్పు
దాడి అనంతరం ‘ఇంతటితో యుద్ధం ముగియలేదు, మా చెప్పుచేతల్లో ఉండే పాలక వర్గాన్ని అక్కడ నియమిస్తాం’ అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆయన సామ్రాజ్యవాద అహంకారానికి నిదర్శనమన్నారు. శాంతి బహుమతులు కావాలని కోరుకునే ట్రంప్ స్వయంగా యుద్ధాలకు తెగబడటం విడ్డూరమని ఎద్దేవా చేశారు. ఇలాంటి దురాక్రమణ దాడులను, యుద్ధాలను ప్రపంచ ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి ఖండించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ తుంగతుర్తి డివిజన్ కార్యదర్శి పేర్ల నాగయ్య, పీవోడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, టీయూసీఐ జిల్లా అధ్యక్షులు గొడ్డలి నరసయ్య, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వేర్పుల లక్ష్మన్న, నాయకులు ఈదుల యాదగిరి, ఎండి జానీబేగం, కందుకూరు రవి, పత్తేపురం వెంకన్న, ఈదుల రవి, ఈదుల ఉపేందర్, వడ్డే పున్నం తదితరులు పాల్గొన్నారు.


