నూరేళ్ల చరిత్ర – అలుపెరగని పోరాటాలు
మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజా చైతన్యం
భారత గడ్డపై సీపీఐ శతాబ్దపు పోరాటాల ముద్ర
18న ఖమ్మం సభను జయప్రదం చేయండి
జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్. సీతామహాలక్ష్మి
కాకతీయ, కూసుమంచి : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) భారత గడ్డపై నూరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సత్తుపల్లిలో ప్రారంభమైన జిల్లా ప్రచార జాతా ఆదివారం కూసుమంచి మండలానికి చేరింది. పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సింగ్ నరసింహారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్. సీతామహాలక్ష్మి నేతృత్వంలో జాతాకు మండల కార్యదర్శి భూక్య నరసింహ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం సెంటర్‌లో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సీతామహాలక్ష్మి మాట్లాడుతూ… సీపీఐ నూరేళ్ల చరిత్రలో అనేక సాయుధ, సమరశీల పోరాటాలు నిర్వహిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిందని గుర్తుచేశారు. మతోన్మాద దాడులు పెరుగుతున్న ఈ సమయంలో ప్రజలు చైతన్యవంతులై ప్రజాస్వామ్య విలువల కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. 18న ఖమ్మంలో జరిగే శతజయంతి ముగింపు సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
పోరాటాల ఖిల్లా ఖమ్మం
గైగోళ్లపల్లిలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సింగ్ నరసింహారావు మాట్లాడుతూ… ఖమ్మం జిల్లా పోరాటాల ఖిల్లాగా పేరొందిందన్నారు. గైగోళ్లపల్లి గ్రామానికి చెందిన అమరజీవి కామ్రేడ్ సంగబత్తుల వెంకటరెడ్డి పేదల కోసం చేసిన భూసంఘర్షణలు చరిత్రలో నిలిచిపోయాయని గుర్తుచేశారు. శతాబ్ద కాలపు పోరాటాల జ్ఞాపకాలతో ఖమ్మం గడ్డపై జరిగే సభకు వేలాదిగా హాజరై సీపీఐ శక్తిని చాటాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కత్రోజు పాండు రంగాచారి, జిల్లా సమితి సభ్యులు గుండెపొంగు మల్లేష్, లాల్ సింగ్ తండా శాఖ కార్యదర్శి భూక్య శ్రీకాంత్, గిరిజన సమాఖ్య మండల అధ్యక్షులు వీరన్న నాయక్, నాయకులు జిల్లా నాగరాజు, చెరుకుపల్లి మల్సూరు, గుండెపంగు మధు, జిల్లా రంగమ్మ, విజయ్ తదితరులు పాల్గొన్నారు.


