కోటపాడులో మిర్చి పంటపై దాడి!
రాజకీయ కక్షతో రైతును నష్టపరిచిన దుండగులు
కలుపు మందుతో పంట నాశనం
బీఆర్ఎస్ గెలుపుపై ఆక్రోశమే కారణమా?
దోషులను గుర్తించి చర్యలు తీసుకోవాలని బీఆర్ ఎస్ నాయకుల డిమాండ్
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : రఘునాథపాలెం మండలం కోటపాడు గ్రామంలో రాజకీయ కక్షతో మిర్చి పంటను నాశనం చేసిన ఘటన కలకలం రేపింది. నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్ కొంటెముక్కల వెంకటేశ్వర్లు తండ్రి శ్రీనివాసరావుకు చెందిన వ్యవసాయ భూమిలో వేసిన మిర్చి పంటపై గుర్తుతెలియని దుండగులు కలుపు మందు కొట్టి పంటను పూర్తిగా దెబ్బతీశారు. సమాచారం అందుకున్న బీఆర్ఎస్ నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని దెబ్బతిన్న మిర్చి పంటను పరిశీలించారు. బీఆర్ఎస్ పార్టీ కోటపాడు సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన ఆక్రోశంతోనే ఈ దాడి జరిగిందని వారు ఆరోపించారు. పార్టీ కార్యకర్తలను, రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
రైతులపై దాడులు సహించబోమని హెచ్చరిక
ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని దుండగులను బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. వ్యవసాయ శాఖా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం నియోజకవర్గంలోనే ఇలాంటి దుర్మార్గాలు జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. పంట నష్టానికి కారణమైన వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యక్తిగత సహాయకుడు రవికిరణ్, మండల అధ్యక్షుడు వీరునాయక్, మాజీ వైస్ ఎంపీపీ గుత్తా రవి, మాజీ సర్పంచ్ హరిప్రసాద్, మెంటం రామారావు, చెరుకూరి ప్రదీప్, తాత వెంకటేశ్వర్లు, దొంతు సత్యనారాయణ, నున్నా శ్రీనివాసరావు, వైస్ సర్పంచ్ ఉపేందర్, భాస్కర్, నగేష్, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


