దుర్షెడ్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం సక్సెస్
300 మందికి వైద్య పరీక్షలు–ఉచిత మందుల పంపిణీ
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ దుర్షెడ్ డివిజన్ కార్యాలయంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. విగ్నేశ్వర యూత్ దుర్షెడ్, వైకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ వల్లి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ వైద్య శిబిరంలో దుర్షెడ్ డివిజన్‌తో పాటు పరిసర గ్రామీణ ప్రాంతాలకు చెందిన 300 మందికి పైగా ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. రక్తపోటు, రక్తంలో చక్కెర, థైరాయిడ్, ఈసీజీ వంటి కీలక పరీక్షలు నిర్వహించి, పలు అనారోగ్య సమస్యలపై వైద్యులు ప్రజలకు అవగాహన కల్పించారు.
సేవా కార్యక్రమాలు అభినందనీయం
ఈ సందర్భంగా డాక్టర్ రవీందర్ మాట్లాడుతూ… గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవడం అభినందనీయమని పేర్కొన్నారు. విగ్నేశ్వర యూత్, వైకే ఫౌండేషన్ సభ్యుల సహకారం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు సాకరామ్, కార్తీక్, పల్లవి వైద్య సేవలు అందించారు. విగ్నేశ్వర యూత్ సభ్యులు టేకుమల్ల వంశీకృష్ణ, బుర్ర హరీష్ గౌడ్, న్యాలం వంశీ, బసవపత్రి అఖిల్, నల్ల సతీష్, వేముల రాఘవ, బుర్ర రాకేష్, నేరెళ్ల శ్రీనివాస్, గొల్లపల్లి ప్రవీణ్, న్యాత శ్రీధర్, నేరెళ్ల మహేష్, మనోజ్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బంది, స్థానిక ప్రజల సహకారంతో శిబిరం విజయవంతమైంది.


