రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన అవసరం : తల్లాడ ఎస్సై పిలుపు
కాకతీయ, తల్లాడ : రోడ్డు భద్రతపై ప్రజలకు పూర్తి అవగాహన ఉండాలని తల్లాడ ఎస్సై వెంకటకృష్ణ అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా తల్లాడ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో జనవరి 1 నుంచి 31 వరకు ప్రభుత్వం రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎస్సై వివరించారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా వాహనదారులు, పాదచారులు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించేలా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
వేగం, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ వినియోగం, త్రిపుల్ రైడింగ్ వంటి చర్యలే ఎక్కువగా ప్రమాదాలకు కారణమవుతున్నాయని హెచ్చరించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ సిగ్నల్స్, వేగ పరిమితి, సరైన వాహన డాక్యుమెంట్లను పాటించాలని సూచించారు. ప్రతి పౌరుడు తన భద్రతకే కాకుండా రోడ్డుపై ఇతరుల పట్ల కూడా శ్రద్ధ వహించాలని ఎస్సై వెంకటకృష్ణ కోరారు.


