ఇసుక మాఫియా బరితెగింపు..!
చింతిర్యాల ర్యాంపు నుంచి యథేచ్ఛగా అక్రమ రవాణా
అనుమతులు లేకుండానే తోలకాలు
మౌనంగా ఉంటున్న అధికారులు
రేయింబవళ్లు ట్రాక్టర్ల హల్చల్…
దుమ్ముధూళితో అశ్వాపురం గ్రామస్థుల నరకయాతన
యంత్రాంగంపై ‘చేతివాటం’ ఆరోపణలు
కాకతీయ, మణుగూరు/అశ్వాపురం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ఇసుక అక్రమ రవాణా పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. చింతిర్యాల ర్యాంపును కేంద్రంగా చేసుకుని గత వారం రోజులుగా పదుల సంఖ్యలో ట్రాక్టర్లు రేయింబవళ్లు ఇసుకను తరలిస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే బహిరంగంగా ఈ అక్రమ దందా సాగుతున్నా, అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండటంపై మండల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాన్ని కమ్మేసిన దుమ్ము ధూళి
చింతిర్యాల గ్రామం మీదుగా నిరంతరాయంగా సాగుతున్న ట్రాక్టర్ల రాకపోకల వల్ల భారీగా దుమ్ము ధూళి రేగుతోంది. ఈ ధూళి ఇళ్లలోకి చేరడంతో వృద్ధులు, చిన్నపిల్లలు శ్వాసకోశ సంబంధిత అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ప్రధాన రహదారిపై నడవాలన్నా, ఇంటి బయటకు రావాలన్నా గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.
‘చేతివాటం’ ఉందన్న ఆరోపణలు
కళ్లముందే అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూడకపోవడం వెనుక ‘చేతివాటం’ ఉందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. వారానికి పైగా ఈ అక్రమ దందా సాగుతున్నా మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖల నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారుల పర్యవేక్షణ లోపమే అక్రమార్కులను మరింత రెచ్చగొడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చింతిర్యాల ర్యాంపు వద్ద సాగుతున్న ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని, గ్రామస్థుల ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.


