నాడు దోస్తీ… నేడు కుస్తీ!
గూడెంలో మొదలైన రాజకీయ వేఢీ
ఫిబ్రవరిలో కొత్తగూడెం బల్దియా ఎన్నికలకు అవకాశం
ఇప్పటికే మొదలైన ఎన్నికల ప్రక్రియ.. ఓటరు జాబితా సన్నద్ధం
మేయర్ కుర్చీపై బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ పార్టీల కన్ను
మున్సిపల్ బరిలో కాంగ్రెస్–కమ్యూనిస్టు తలపడే అవకాశం..?
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : కొత్తగూడెం నియోజకవర్గంలో మున్సిపల్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పాల్వంచ మున్సిపాలిటీని విలీనం చేస్తూ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయడంతో, ఈ ఏడాది తొలిసారిగా కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశముండటంతో ఇప్పటికే ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో అన్ని పార్టీల దృష్టి మేయర్ కుర్చీపైనే నిలిచింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్–సీపీఐ పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటు సీపీఐకి కేటాయించగా, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లును ఓడించి సీపీఐ నేత కూనంనేని విజయం సాధించారు. అయితే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో మిశ్రమ ఫలితాలు రావడంతో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారుతున్నాయి. బీఆర్ ఎస్ పార్టీ పుంజుకుంటున్నాయనే వాదన వినిపిస్తోంది. అదే సమయంలో తమకు సీట్లు కేటాయించకుంటే పార్టీలో పరిస్థితి మారుతుందంటూ కొంతమంది కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది.
ఇదీ కార్పొరేషన్ స్వరూపం
పాల్వంచ మున్సిపాలిటీని కొత్తగూడెం మున్సిపాలిటీలో విలీనం చేయడంతో పాటు, సుజాతనగర్ మండలానికి చెందిన మంగపేట, నర్సింహసాగర్, నాయకులగూడెం, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, నిమ్మలగూడెం, కోమటిపల్లి గ్రామ పంచాయతీలను కలిపి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. ఇదివరకు కొత్తగూడెంలో 33, పాల్వంచలో 24 వార్డులు ఉండగా, తాజా పునర్విభజనతో మొత్తం 60 డివిజన్లు ఏర్పాటయ్యాయి. ఈ మార్పుతో కార్పొరేషన్ ఎన్నికలు మరింత కీలకంగా మారాయి.
2020లో బీఆర్ఎస్‌దే పైచేయి
2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అప్పటి టీఆర్‌ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) స్పష్టమైన ఆధిపత్యం చాటింది. మొత్తం 33 వార్డులకు గాను బీఆర్ఎస్ – 18, సీపీఐ – 6, కాంగ్రెస్ – 4, సీపీఐ(ఎం) – 1,ఇతరులు – 4
వార్డులను గెలుచుకున్నారు. ఆ ఎన్నికల అనంతరం కాపు సీతాలక్ష్మి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అప్పట్లో బల్దియాపై కారు పార్టీదే పట్టు కొనసాగింది.
కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టు..?
ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో పొత్తుతో బరిలో దిగిన కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు… రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి సిద్ధమవుతున్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో సీపీఐ–కాంగ్రెస్ మధ్య నేరుగా పోరు తప్పదన్న చర్చ సాగుతోంది.
మరోవైపు బీఆర్ఎస్ కూడా కార్పొరేషన్ ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాపర్యటనలు ఖరారు కావడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. నాడు పొత్తు… నేడు పోటీగా మారుతుండటంతో కొత్తగూడెం మున్సిపల్ రాజకీయాలు ‘నువ్వా… నేనా…’ అన్న దశకు చేరాయి. మేయర్ పీఠం ఎవరి వశమవుతుందోనన్న ఉత్కంఠతో ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


