నాడు విద్యార్థి.. నేడు గ్రామ పాలకుడు
లావుడ్య పూర్ణకు అరుదైన గౌరవం
రేగళ్ల పాఠశాలలో ఉపాధ్యాయులతో సత్కారం
స్కూల్ సమస్యల పరిష్కారానికి సర్పంచ్ హామీ
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : రేగళ్ల పెద్దతండా ఆశ్రమ పాఠశాల శనివారం ఓ అరుదైన ఘటనకు వేదికైంది. ఇరవై సంవత్సరాల క్రితం ఇదే పాఠశాలలో అక్షరాభ్యాసం చేసిన లావుడ్య పూర్ణ, నేడు అదే గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నికై, అదే పాఠశాలలో ఉపాధ్యాయుల చేతుల మీదుగా సన్మానం పొందారు. అక్షరాలు నేర్పిన గడప వద్దే ప్రజాప్రతినిధిగా గౌరవం అందుకోవడంతో పూర్ణ భావోద్వేగానికి గురయ్యారు. నాడు పుస్తకాలు చేతబట్టి తరగతుల్లో కూర్చున్న విద్యార్థి, నేడు గ్రామ పాలన బాధ్యతలు చేపట్టి గురువుల ఎదుట నిలవడం విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే దృశ్యంగా మారింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు లావుడ్య పూర్ణను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. సన్మానం అనంతరం లావుడ్య పూర్ణ మాట్లాడుతూ తన జీవితానికి దిశానిర్దేశం చేసిన ఈ పాఠశాలపై కృతజ్ఞతాభావం వ్యక్తం చేశారు. నాడు ఓనమాలు నేర్చుకున్న చోటే నేడు సర్పంచ్‌గా గౌరవం దక్కడం తన జీవితంలో మరువలేని క్షణమని తెలిపారు.
పాఠశాల అభివృద్ధే నా బాధ్యత
“నన్ను తీర్చిదిద్దిన ఈ పాఠశాల అభివృద్ధే నా తొలి బాధ్యత. మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పూర్తిస్థాయిలో కృషి చేస్తాను. పాఠశాల అవసరాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి ప్రయత్నిస్తాను” అని లావుడ్య పూర్ణ హామీ ఇచ్చారు. అక్షరాలు నేర్పిన గురువుల ఎదుట ప్రజాసేవ సంకల్పాన్ని ప్రకటించడం కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.


