ప్రభుత్వ భవనాలకే కార్యాలయాలు
ప్రైవేట్ భవనాల నుంచి త్వరితగతిన షిఫ్టింగ్
12 కార్యాలయాల తరలింపుపై అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి సమీక్ష
అద్దె భారం తగ్గించడమే లక్ష్యం
అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ప్రైవేట్ భవనాల్లో నడుస్తున్న ప్రభుత్వ కార్యాలయాలను ప్రభుత్వ భవనాలకు తరలించే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ అంశంపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ బిల్డింగ్స్‌లో కొనసాగుతున్న 12 ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై అదనపు కలెక్టర్ విస్తృతంగా చర్చించారు. ప్రజాధనాన్ని ఆదా చేయడంతో పాటు ప్రభుత్వ ఆస్తుల వినియోగం పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
పంచాయతీ భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు
చింతకాని మండలంలోని రేపల్లెవాడ, రైల్వే కాలనీ, రాఘవపురం, నర్సింహాపురం గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు పంపాలని సూచించారు. భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు అద్దె చెల్లింపులను జనరల్ ఫండ్ నుంచి చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కామేపల్లి సీడీపీఓ కార్యాలయాన్ని పండితాపురం కమిటీ హాల్ భవనానికి, ఖమ్మం అర్బన్ సీడీపీఓ కార్యాలయాన్ని చిల్డ్రన్ హోమ్స్ వద్ద ఉన్న ప్రభుత్వ భవనానికి తరలించాలని తెలిపారు. తిరుమలాయపాలెం సీడీపీఓ కార్యాలయానికి అనువైన ప్రభుత్వ భవనాన్ని గుర్తించి నివేదిక సమర్పించాలని సూచించారు. ఖమ్మం రూరల్, మధిర, సత్తుపల్లి సీడీపీఓ కార్యాలయాలను అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలకు త్వరితగతిన తరలించాలని ఆదేశించారు. జిల్లా ఇన్సూరెన్స్ యూనిట్ టీఎస్‌జీఎల్‌ఐ కార్యాలయాన్ని పాత మున్సిపాలిటీ భవనానికి హ్యాండ్ ఓవర్ చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారిణి జ్యోతి, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసాచారి, ఆర్‌అండ్‌బీ ఎస్ఈ యాకుబ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేంద్ర రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య, జిల్లా మార్కెటింగ్ అధికారి అలీమ్, ఉద్యానవన శాఖ అధికారి మధుసూదన్, ఇరిగేషన్ అధికారి వెంకట్రాం, ఏడి మైన్స్ సాయినాథ్, జిల్లా వైద్యాధికారి డా. రామారావు, జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విజయలక్ష్మి, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ రంజిత్, కలెక్టరేట్ ఏవో శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు.


