పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించాలి
వారి భవిష్యత్తుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి
సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో ముందుకు సాగాలి
మహిళా ఉపాధ్యాయులకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పిలుపు
మహిళ ఉపాధ్యాయులకు ఘన సత్కారం
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అభ్యున్నతికి ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పని చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. సమాజానికి మేలు చేసే గౌరవప్రదమైన స్థాయిలో ఉపాధ్యాయులు ఉన్నారని, పిల్లలను అభివృద్ధి దిశగా నడిపించాల్సిన బాధ్యత వారి మీదే ఉందన్నారు.సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన మహిళా ఉపాధ్యాయురాల దినోత్సవం వేడుకల్లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
బాలికల విద్యకు సావిత్రిబాయి సేవలు
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… కుల, మత, వర్ణ వివక్షత అధికంగా ఉన్న కాలంలోనే సావిత్రిబాయి పూలే బాలికల విద్య కోసం విశేషంగా పోరాడిన మహనీయురాలని కొనియాడారు. ఆమె అడుగుజాడల్లో నడుస్తూ నేటి ఉపాధ్యాయులు మరింత అంకితభావంతో పని చేసి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని సూచించారు. సమాజంలో ఉపాధ్యాయులు అత్యంత గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారని, విద్యతో పాటు పిల్లల్లో నైతిక విలువలు పెంపొందిస్తూ వారిని చక్కగా తీర్చిదిద్దాలని కలెక్టర్ పేర్కొన్నారు. పాఠశాలల అభ్యున్నతి కోసం ప్రతి ఉపాధ్యాయుడు బాధ్యతతో కృషి చేయాలని సూచించారు. అనంతరం విశిష్ట సేవలు అందించిన మహిళా ఉపాధ్యాయులను శాలువా, మోమెంటో, ప్రశంసా పత్రాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని, జిల్లా విద్యాశాఖ కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, సెక్టోరల్ అధికారుల బృందం రామకృష్ణ, పెసర ప్రభాకర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, రూబీ, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, సన్మాన గ్రహీతలు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


