విద్యే సమానత్వానికి ఆయుధం
వసతి గృహ సంక్షేమ అధికారి కోటపాటి రుక్మారావు
బాలుర హాస్టల్‌లో సావిత్రిబాయి పూలే జయంతి
కాకతీయ, ఖమ్మం : సావిత్రిబాయి పూలే 195వ జయంతిని ఖమ్మం నగరంలోని ప్రభుత్వ ఎస్సీ బాలుర హాస్టల్ (బి)లో ఘనంగా నిర్వహించారు. వసతి గృహ సంక్షేమ అధికారి కోటపాటి రుక్మారావు ఆధ్వర్యంలో శనివారం జయంతి కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆమె సేవలను స్మరించుకుంటూ విద్యార్థులకు ఆమె జీవిత చరిత్ర, సమాజంలో ఆమె చేసిన పోరాటాలపై వివరించారు. ఈ సందర్భంగా కోటపాటి రుక్మారావు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జీవితం నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల పిల్లల విద్యాభివృద్ధి కోసం ఆమె చేసిన త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అందరికీ విద్య అందాలన్నదే ఆమె లక్ష్యమని గుర్తుచేశారు. చదువుతోనే వ్యక్తిగతంగా, సామాజికంగా ఎదగడం సాధ్యమని, విద్యార్థులు సావిత్రిబాయి పూలే చూపిన మార్గాన్ని అనుసరించి క్రమశిక్షణతో చదువుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హాస్టల్ సిబ్బంది వెంకన్న, నరేష్, తిరుపతిరావు, విద్యార్థులు పాల్గొని జయంతి వేడుకలను విజయవంతం చేశారు.


