విద్యారంగంపై ప్రభుత్వం నిర్లక్ష్యం
జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలి
ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్
కాకతీయ, హుజురాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ తీవ్రంగా విమర్శించారు. ఎన్నికలపై చూపుతున్న శ్రద్ధ విద్యార్థుల సంక్షేమంపై ప్రభుత్వం చూపడం లేదని, ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగం సమస్యలతో కుదేలవుతోందన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించాలని, లేనిపక్షంలో ఉద్యమాల ద్వారా హక్కులు సాధిస్తామని హెచ్చరించారు. శుక్రవారం హుజురాబాద్ మండల ఏఐఎస్ఎఫ్ మహాసభను కేశబోయిన రాము యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రామారపు వెంకటేష్ మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే విద్యారంగ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా ఆశించిన మార్పులు కనిపించడం లేదన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు లేకపోవడం, బీసీ సంక్షేమ హాస్టళ్లు, బాలికల హాస్టళ్లు శిథిలావస్థలో ఉండడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వాటికి సొంత భవనాలు నిర్మించి, నూతన గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని, ఇందుకు స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని కోరారు.
నూతన మండల కమిటీ
ఈ సమావేశం అనంతరం ఏఐఎస్ఎఫ్ హుజురాబాద్ మండల నూతన కమిటీని ప్రకటించారు. మండల అధ్యక్షుడిగా బండి నిఖిల్, కార్యదర్శిగా రాపేళ్ళి రోహిత్, ఉపాధ్యక్షుడిగా కడారి శివాజీ, సహాయ కార్యదర్శిగా కయితాల అవినాష్, కోశాధికారిగా చిన్నోజు రాధాకృష్ణ ఎన్నికయ్యారు. సభ్యులుగా రషద్ బాబా, లక్ష్మణ్, అంజీ, హర్షిత్, వరుణ్, రాము, ఎండీ రెజ్వీన్, స్రవణ్, శివా, సాయి చరణ్ ఎంపికయ్యారు.


