ట్రాఫిక్ రూల్స్ పాటిస్తేనే ప్రాణాలకు భద్రత
వైరా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎ. వరప్రసాద్
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : సమాజంలో ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని వైరా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎ. వరప్రసాద్ స్పష్టం చేశారు. 37వ జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు వైరా రవాణా శాఖ కార్యాలయంలో వాహనదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ, రోడ్డుపై ప్రయాణించే ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా సీట్‌బెల్ట్ ధరించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా వాహనం నడపరాదని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాపాయాలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు మీద ప్రయాణిస్తున్న కార్లు, ద్విచక్ర వాహనాల డ్రైవర్లకు క్షేమంగా ప్రయాణించాలంటూ సూచనలు చేశారు.
మానవ తప్పిదాలే ప్రమాదాలకు మూలం
ప్రయాణ సమయంలో కుటుంబ సభ్యులు, బాధ్యతలను గుర్తుంచుకుని జాగ్రత్తగా వాహనం నడపాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం మానవ తప్పిదాలేనని, ముఖ్యంగా యువత రోడ్డు భద్రత పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వాహనదారులకు సీట్‌బెల్ట్, రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. లైసెన్స్ హోల్డర్లతో జాతీయ రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వైరా వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎన్‌ఫోర్స్‌మెంట్–ఖమ్మం) ఎల్. రాజశేఖర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె. స్పార్టకస్ (ట్రైనీ), కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, హోంగార్డు ఆలీ తదితరులు పాల్గొన్నారు.


