హ్యాపీ న్యూ ఇయర్ సార్
ముఖ్యమంత్రిని కలిసిన కల్పనా చౌదరి
సెక్రటేరియట్లో మర్యాదపూర్వక భేటీ
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : నూతన సంవత్సరం–2026ను పురస్కరించుకుని కొల్లి ఫౌండేషన్ చైర్మన్ కొల్లి కల్పనా చౌదరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని హైదరాబాద్ సెక్రటేరియట్లో మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతులు మరియు అన్ని వర్గాల వారు సుఖసంతోషాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. 2026వ సంవత్సరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరింత ఫలప్రదంగా కొనసాగాలని, అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత వేగంగా ముందుకు సాగాలని కొల్లి కల్పనా చౌదరి ఆకాంక్షించారు. రాష్ట్రానికి, ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా మంచి పేరు, ప్రఖ్యాతలు రావాలని సీఎం, మంత్రివర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ–గృహ నిర్మాణ–సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వ విజయబాబు సహా పలువురు మంత్రులు, వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులను సెక్రటేరియట్లో ప్రత్యక్షంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొల్లి కల్పనా చౌదరి చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను ప్రభుత్వ పెద్దలు అభినందించారు. 2026లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని వారు ఆకాంక్షించారు.


