ఎస్‌ఆర్‌ఎస్‌పీ నీళ్లు నిరంతరం ఇవ్వాలి
వారబంది విధానంతో చివరి ఆయకట్టుకు నష్టం
చివరి దశలో పంటలు ఎండిపోయే ప్రమాదం
ధాన్యం బోనస్ చెల్లింపుల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం
బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య
కాకతీయ, తుంగతుర్తి : యాసంగి పంటకు ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాల్వల ద్వారా వారబంది పద్ధతి కాకుండా కనీసం నెల రోజులపాటు నిరంతరాయంగా నీటిని విడుదల చేయాలని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. తుంగతుర్తిలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.యాసంగి సాగు పూర్తిగా కాల్వలపై ఆధారపడి ఉన్న రైతులకు మొదటి నుంచే వారబంది విధానంలో నీళ్లు విడుదల చేస్తే చివరి కాల్వల వరకు నీరు చేరడం కష్టమని తెలిపారు. చివరి ఆయకట్టు రైతుల పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. యాసంగి పంట చివరి దశకు చేరుకున్న సమయంలో నీటి కొరత ఏర్పడితే పంట పూర్తిగా నష్టపోతుందని అన్నారు.
కనీసం ఒక నెల రోజులపాటు నిరంతరం నీళ్లు విడుదల చేసి, ఆ తర్వాతే వారబంది అమలు చేస్తేనే పంట చేతికొస్తుందని స్పష్టం చేశారు. ఇందుకు స్థానిక ఎమ్మెల్యే వెంటనే అధికారులతో చర్చించి చర్యలు తీసుకోవాలని కోరారు.
చివరి ఆయకట్టు రైతుల పరిస్థితి దయనీయం
చివరి కాల్వలపై ఆధారపడి ఉన్న రైతులు ఎలాంటి ప్రత్యామ్నాయం లేకుండా సాగు చేశారని, నీరు అందకపోతే వారి పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చివరి దశలో పంటలు ఎండిపోతే రైతులకు తీవ్ర నష్టం తప్పదని హెచ్చరించారు. ఐకేపీ కేంద్రాల ద్వారా సన్న ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం నెల రోజులు దాటినా రైతులకు బోనస్ డబ్బులు చెల్లించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. సంబంధిత మంత్రి ప్రకటించిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని ఆరోపించారు. గతంలో కేసీఆర్ పాలనలో ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాల్వల్లో ఏడాదికి తొమ్మిది నెలల పాటు నీళ్లు నిండుగా పారేవని, రైతులు నీటి కోసం ఆందోళన చెందాల్సిన అవసరం ఉండేదే కాదని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లుగా రైతాంగం నీటి సమస్యలు, బోనస్ ఆలస్యం, పంట నష్టాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని అన్నారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచులు కొండగడుపుల నాగయ్య, గుగులోతు వీరోజీ, నాయకులు గోపగాని వెంకన్న, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.


