జయ రామ.. జయ జయ రామ..
వైకుంఠ రాముడిగా అనుగ్రహించిన భద్రాద్రి రామయ్య
ఉత్తర ద్వార దర్శనంతో తరించిన భక్తజనం
కాకతీయ, కొత్తగూడెం : దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు ఆధ్యాత్మిక వైభవోపేతంగా ఘనంగా జరిగాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మంగళవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించారు. వైకుంఠ రాముడిగా అలంకరించబడిన స్వామివారి దివ్య దర్శనంతో భక్తులు పరవశించి శ్రీరామ జయ రామ జయ జయ రామ జయజయధ్వానాలతో భద్రాద్రి క్షేత్రం మారుమోగింది. ఉత్తర ద్వార దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వీవీఐపీ, వీఐపీ, సాధారణ భక్తుల సెక్టార్లలో భక్తులు శాంతియుతంగా దర్శనాలు చేసుకున్నారు.

వేదపండితులు, స్థానాచార్యులు ముక్కోటి ఏకాదశి విశిష్టతను వివరించగా అర్చకులు 108 ఒత్తులతో మహాహారతి నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను మాడ వీధుల్లో భక్తిశ్రద్ధల మధ్య ఊరేగించారు. ఈ సందర్భంగా స్వామివారు గరుడ వాహనంపై శ్రీమహావిష్ణు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీరామ పదాక్షరీ మంత్రంతో అష్టోత్తర శతనామార్చన, చతుర్వేద పఠనం, గరుడ ప్రబంధాలు, ఇతిహాస పఠనం, శరణాగతి గజగరుడ దండం, భక్తరామదాసు రచించిన దాశరథి శతక పఠనం తదితర విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వైకుంఠ రాముడికి అష్టోత్తర శతహారతిని భక్తిశ్రద్ధలతో సమర్పించారు. భక్తరామదాసు కాలం నుంచీ కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం భద్రాచలం తహసీల్దార్ మూలవిరాట్టులకు స్నపన కార్యక్రమం నిర్వహించారు. ఉత్తర ద్వార దర్శనం అనంతరం వైకుంఠ రాముడు తిరువీధి సేవకు బయలుదేరారు. చలువ చప్పర వాహనంపై పెరియాళ్వార్, నమ్మాళ్వార్, మరో వాహనంపై అండాళ్ అమ్మవారు, హనుమత్ వాహనంపై లక్ష్మణస్వామి, గజవాహనంపై సీతమ్మవారు, గరుడ వాహనంపై శ్రీ సీతారామచంద్ర మూర్తుల తిరువీధి సేవ మేళతాళాలు, భాజా భజంత్రీలు, వేదమంత్రోచ్చారణల మధ్య శోభాయమానంగా సాగింది. రాపత్తు ఉత్సవాలతో వేడుకలు మరింత వైభవాన్ని సంతరించుకున్నాయి.

భక్తులకు సౌకర్యాలు..!
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రతి సెక్టార్‌లో ఏర్పాట్ల పర్యవేక్షణకు జిల్లా అధికారులు, లైజన్ అధికారులను నియమించగా, బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు స్వయంగా పర్యవేక్షించారు. ఈ వేడుకకు భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్ రావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఐటిడిఏ పీఓ రాహుల్, ట్రైనీ కలెక్టర్ సొరబ్ శర్మ, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఏఎస్పీ విక్రాంత్ సింగ్, దేవస్థానం ఈఓ దామోదర్ రావు, భద్రాచలం సర్పంచ్ పూనం కృష్ణ దొర తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు విజయవంతం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో నిర్వహించిన ముక్కోటి ఏకాదశి, ఉత్తర ద్వార దర్శన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమర్థవంతమైన ఏర్పాట్లు చేశామని, ఈ ఉత్సవాల నిర్వహణలో సహకరించిన జిల్లా యంత్రాంగానికి, భక్తులకు, పాత్రికేయులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.


