సింగరేణి ప్రైవేటీకరణకు అవకాశమివ్వొద్దు
కార్మికుల సంక్షేమం విస్మరించొద్దు ..
ప్రభుత్వంపై బాధ్యత ఉందన్న ఎమ్మెల్యే
అసెంబ్లీలో కూనంనేని హెచ్చరిక
కాకతీయ, కొత్తగూడెం : అనేక కుటుంబాలకు జీవనాధారంగా ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీని భవిష్యత్తులో ప్రైవేటీకరణకు గురికాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో స్పష్టం చేశారు. సింగరేణి కొద్ది రోజుల్లో ప్రైవేట్ పరం అయ్యే వాతావరణం కనిపిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, అలాంటి సంస్థను ప్రైవేట్ పరం చేయకుండా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వాన్ని కోరారు.
బకాయిలు చెల్లించాలి
సింగరేణికి వివిధ శాఖల నుంచి దాదాపు రూ.43 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూనంనేని డిమాండ్ చేశారు. బకాయిల భారంతో కంపెనీ ఆర్థికంగా దెబ్బతింటోందని పేర్కొన్నారు. రిటైర్డ్ కార్మికుల పిల్లలకు ఉద్యోగాల కోసం నిర్వహించే మెడికల్ బోర్డును చిత్తశుద్ధితో నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్మికుల సంక్షేమాన్ని విస్మరించవద్దని, సింగరేణిలో రాజకీయ జోక్యం పెరుగుతోందన్న ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.
కొత్త బొగ్గు బ్లాకులు సింగరేణికే
కొత్తగా కేటాయించే బొగ్గు బ్లాకులు సింగరేణి ఆధ్వర్యంలోనే నడిచేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. సింగరేణి కొనసాగితేనే ఉపాధి అవకాశాలు కొనసాగుతాయని, ప్రైవేటీకరణ ఆలోచనను పూర్తిగా విరమించుకోవాలని కూనంనేని సాంబశివరావు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


