ముగిసిన ఐబొమ్మ రవి కస్టడీ విచారణ
కీలక వివరాలు సేకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు
పైరసీ రాకెట్‌లో మున్ముందు మరిన్ని అరెస్టులు ?
కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఐబొమ్మ నిర్వాహకుడు రవి కస్టడీ విచారణ పూర్తయింది. రవి కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక వివరాలు సేకరించారు. ప్రహ్లాద్ వెల్లేల పేరిట రవి పాన్, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. గతంలో ప్రహ్లాద్ తన రూమ్మేట్ అని రవి పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు బెంగళూరు నుంచి ప్రహ్లాద్‌ను పిలిపించి విచారించారు. కస్టడీలో ఉన్న రవి ఎదుటే ప్రహ్లాద్‌ను పోలీసులు ప్రశ్నించారు. ఇమంది రవి ఎవరో తనకు తెలీదని పోలీసులకు ప్రహ్లాద్ చెప్పాడు. తన పేరుతో రవి పాన్, లైసెన్స్ తీసుకున్నట్లు తెలిసి షాక్‌కు గురయ్యానని ప్రహ్లాద్ అన్నాడు. ప్రహ్లాద్ డాక్యుమెంట్లు ఇమంది రవి దొంగలించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక, గతంలో చేసిన బ్యాంక్ ట్రాన్సక్షన్లను చూపించి రవిని పోలీసులు ప్రశ్నించారు. లక్షల్లో లావాదేవీలు, డొమైన్ కొనుగోలు, ఐపీ మాస్క్ చేయడం గురించి రవిని పోలీసులు ప్రశ్నించారు. సర్వర్ లోడ్ కెపాసిటీ గురించి, ఎవరెవరు ఆ సర్వర్ మైంటైన్ చేస్తున్నారు అని కూడా పోలీసులు ఆరా తీశారు. త్వరలోనే పైరసి రాకెట్‌లో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం కనబడుతోంది. కాగా, రవి 12 రోజుల కస్టడీ ఈ రోజుతో ముగిసింది. రవిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు అనంతరం నాంపల్లి కోర్టులో హజరుపరిచారు.


