దోపిడీలు, హత్యలు తగ్గుముఖం
రికవరీల్లో 9 శాతం వృద్ధి.. సైబర్ నేరాలపై దాడి
ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : సమర్థవంతమైన పోలీసింగ్, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, ప్రాసిక్యూషన్‌తో సమన్వయం వల్ల ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రధాన నేరాలు గణనీయంగా తగ్గాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వెల్లడించారు. సోమవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వార్షిక నివేదిక–2025ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా నేర నియంత్రణ, రికవరీలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై సమగ్ర వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది దోపిడీలు, ఇంటి దొంగతనాలు, చైన్‌స్నాచింగ్, హత్యలు, హత్యాయత్నాలు గతంతో పోలిస్తే స్పష్టంగా తగ్గినట్లు కమిషనర్ తెలిపారు. విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్, ఆకస్మిక తనిఖీలతో నేరాలపై నియంత్రణ సాధ్యమైందన్నారు. చోరీ కేసుల ఛేదింపులో పురోగతి సాధించి రూ.2.45 కోట్ల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే రికవరీలు 9 శాతం పెరిగాయని వివరించారు. సైబర్ నేరగాళ్లు దోచుకున్న రూ.4.5 కోట్లను బాధితుల ఖాతాల్లోకి జమ చేయగా, మరో రూ.1.5 కోట్లను హోల్డ్ చేసినట్లు తెలిపారు. సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు.
శిక్ష శాతం పెరిగింది
ప్రాసిక్యూషన్ అధికారులు, పోలీసుల సమన్వయంతో దోషులకు శిక్ష పడే శాతం పెరిగిందని తెలిపారు. ఈ ఏడాది 11 కేసుల్లో జీవితఖైదు పడిందని వెల్లడించారు. లోక్ ఆధాలత్ ద్వారా 36,709 కేసులు పరిష్కారం కాగా, మొత్తం 9,792 కేసులు నమోదు అయ్యాయని కమిషనర్ వివరించారు.


