రౌడీషీటర్లకు పోలీస్ కౌన్సెలింగ్
*టౌన్ ఏసీపీ రమణమూర్తి హెచ్చరిక
కాకతీయ, ఖమ్మం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు సోమవారం ఖమ్మం నగరంలోని రౌడీషీటర్లకు టౌన్ ఏసీపీ రమణమూర్తి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఏసీపీ కార్యాలయంలో ఒక్కొక్కరిని పిలిపించి వారి నివాసం, జీవనోపాధి వివరాలు తెలుసుకున్నారు. నేరప్రవృత్తిని వీడి సత్ప్రవర్తనతో జీవించేందుకు ఇది చివరి అవకాశం అని, మార్పు లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాత నేరస్తులు, రౌడీషీటర్లు మళ్లీ నేరాలకు పాల్పడితే ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ, ప్రైవేట్ భూముల కబ్జాలు, రియల్టర్ల తరహా అక్రమాల్లో పాల్గొనే రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. నగరంలో జరుగుతున్న అనేక నేరాల్లో రౌడీషీటర్లే ప్రధానంగా భాగస్వాములవుతున్నారని, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుని దాడులకు దిగుతున్న నేపథ్యంలో ముందస్తు కట్టడి చర్యలుగా కౌన్సెలింగ్ చేపట్టినట్లు వివరించారు. కొంతకాలంగా సత్ప్రవర్తనతో ఉండి నేరాలకు దూరంగా ఉన్న పాత నేరస్తుల కేసు డైరీలను పరిశీలించి, వారి రౌడీషీట్లు తొలగించినట్లు ఏసీపీ తెలిపారు. అయితే మళ్లీ నేరాలకు పాల్పడితే రౌడీషీట్లు తిరిగి తెరుస్తామని హెచ్చరించారు. రౌడీషీటర్లు లేదా నేరస్తులు ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ప్రజలను ఏసీపీ రమణమూర్తి కోరారు.


