యూరియా అమ్మకాలు యాప్ ద్వారానే
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : జిల్లాలో సోమవారం నుంచి యూరియా అమ్మకాలు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా మాత్రమే నిర్వహిస్తామని జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత వానాకాలంలో ఎదురైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియా సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్‌ను ప్రవేశపెట్టిందన్నారు. ప్రతి అర్హ రైతుకు అవసరమైన యూరియాను పారదర్శకంగా అందించడం, ఎరువుల దుకాణాల వద్ద క్యూలలో నిలబడి రైతులు ఆందోళన చెందకుండా చేయడం, జిల్లాలో ఎక్కడ ఎంత యూరియా నిల్వ ఉందో తెలుసుకునే వెసులుబాటు కల్పించడమే ఈ యాప్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రైతులు తమ పంట రకం, సాగు విస్తీర్ణం ఆధారంగా జిల్లాలోని ఏ డీలర్ లేదా సహకార సంఘం వద్ద ఉన్న యూరియానైనా ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు.
24 గంటల్లో కొనుగోలు తప్పనిసరి
యూరియా బుక్ చేసుకున్న రైతు 24 గంటలలోపు సంబంధిత డీలర్ వద్దకు వెళ్లి కొనుగోలు చేయాలని సూచించారు. నిర్ణీత సమయంలో తీసుకోకపోతే బుకింగ్ రద్దు అవుతుందని, మళ్లీ కొత్తగా బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. పట్టాదారులు, పట్టా పుస్తకం లేని రైతులు, కౌలు రైతులు కూడా ఈ యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. కౌలు రైతులు భూమి యజమాని పట్టాదారు పాస్‌బుక్ నంబర్‌తో బుకింగ్ చేయవచ్చని, ఇందుకు పట్టాదారు ఓటీపీ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
రైతులకు యాప్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఔట్‌లెట్ వద్ద వ్యవసాయ శాఖ సిబ్బందిని లేదా సంబంధిత ఏఈఓను నియమిస్తామని తెలిపారు. డీలర్లు, సహకార సంఘాలు యాప్ ద్వారానే యూరియా అమ్మకాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశామని స్పష్టం చేశారు.


