ఉపాధి హామీ చట్టానికి మోదీ తూట్లు
చట్ట మార్పులతో పేదలకు నష్టం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న
కాంగ్రెస్ ఆధ్వర్యంలో మానవహారం
కాకతీయ, కొత్తగూడెం : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న తీవ్రంగా విమర్శించారు. చట్టంలో మార్పులు చేస్తూ జాతిపిత మహాత్మ గాంధీ పేరును తొలగించి పేదల కడుపు కొట్టాలని మోడీ ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. ఈ విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం కొత్తగూడెం త్రీ టౌన్ సెంటర్‌లో నిరసన ప్రదర్శనతో పాటు మానవహారం కార్యక్రమం నిర్వహించారు.
చట్ట నిర్వీర్యానికి కుట్ర
ఈ సందర్భంగా తోట దేవి ప్రసన్న మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఉపాధి హామీ పథకం కోట్లాది గ్రామీణ పేదలకు జీవనాధారమని, దానిపై దాడి సహించబోమన్నారు. పేదల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుండి పోరాడుతుందని, గాంధీ పేరుతో కూడిన చట్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ, ఆళ్ళ మురళి, నాగ సీతారాములు, జేబీ బాలసౌరి, ఏనుగుల అర్జున్ రావు, చీకటి కార్తీక్, పౌలు, సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ వై. శ్రీనివాస్ రెడ్డి, చింతలపూడి రాజశేఖర్, రావి రాంబాబు, మేరెడ్డి జనార్దన్ రెడ్డి, బాల పాసి, పరమేష్, తలుగు అనిల్, ఆకుల సుధాకర్, సుందర్లాల్ కోరి, జానీ పాషా, మాధవ్, మహిళా కాంగ్రెస్ జిల్లా నాయకులు గడిపల్లి కవిత, రాజ్యలక్ష్మి, వాణి రెడ్డి, జోగు రమాదేవి, నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


