“జిల్లా అధ్యక్షుడిపై చర్యలు తప్పవు”
పార్టీ కార్యాలయంలో బీసీ నేతపై దాడి
నాగం అనుచరుల దౌర్జన్యంపై అధిష్టానం ఆగ్రహం
బీసీ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత
పదవి నుంచి తొలగించాలంటూ క్యాడర్ డిమాండ్
కాకతీయ, నల్గొండ : బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిపై పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. నాలుగు రోజుల క్రితం జిల్లా పార్టీ కార్యాలయంలో బీసీ నేత పిల్లి రామరాజు యాదవ్‌పై నాగం వర్షిత్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడిన ఘటన తీవ్ర దుమారం రేపింది. ఈ దాడి నాగం వర్షిత్ రెడ్డి ఆదేశాలతోనే జరిగిందని ఆరోపిస్తూ పిల్లి రామరాజు యాదవ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావును కలిసి ఫిర్యాదు చేశారు. దీనిని అధిష్టానం గంభీరంగా పరిగణనలోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
అధిష్టానానికి ఫిర్యాదు, పెరిగిన ఒత్తిడి
దాడి ఘటనపై బీసీ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో పార్టీ అధిష్టానం నాగం వర్షిత్ రెడ్డిని మందలించినట్లు సమాచారం. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించారని, ఇలాంటి ఘటనలు పార్టీకి నష్టం చేస్తాయని స్పష్టమైన హెచ్చరిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో నాగం వర్షిత్ రెడ్డిని జిల్లా అధ్యక్ష పదవి నుంచి వెంటనే తొలగించాలని బీజేపీ క్యాడర్ డిమాండ్ చేస్తోంది. బీసీ నేతలపై దాడులు సహించబోమని, చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని పలువురు నేతలు హెచ్చరిస్తున్నారు. మొత్తం పరిణామాల నేపథ్యంలో నాగం వర్షిత్ రెడ్డిపై కఠిన చర్యలకు అధిష్టానం సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.


