కాంగ్రెస్ భావజాలం బతికితేనే దేశానికి రక్ష
మత విద్వేష రాజకీయాలతో సమాజానికి తీరని నష్టం
ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలనే బీజేపీ కుట్ర
దేశ అభివృద్ధికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీనే
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : దేశ రక్షణకు కాంగ్రెస్ భావజాల వ్యాప్తి ఒక్కటే మార్గమని, ఆ భావజాలం బతికి ఉంటేనే భారతదేశ సమైక్యత, ప్రజాస్వామ్యం కాపాడబడుతాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు. దేశం స్వాతంత్ర్యం సాధించిన చారిత్రక రోజును గుర్తు చేస్తూ, స్వేచ్ఛ కోసం బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదిరించిన పార్టీ కాంగ్రెస్ అని భట్టి విక్రమార్క అన్నారు. శతాబ్దాలుగా కులాలు, మతాలు అనే భేదం లేకుండా కలిసి జీవిస్తున్న భారత సమాజంలో కొందరు రాజకీయ లబ్ధి కోసం మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఇలా రాజకీయ లాభం పొందవచ్చేమోగానీ, సమాజానికి మాత్రం తీరని నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉపాధి హామీపై కుట్రలు
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని డిప్యూటీ సీఎం ఆరోపించారు. లక్ష కోట్ల రూపాయల బడ్జెట్‌తో పేదలకు ఉపాధి కల్పించాలనే గొప్ప ఆశయంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొస్తే, నేడు దాన్ని కనుమరుగు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. గాంధీజీ పేరును పథకం నుంచి తొలగించడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఈ కుట్రలను ఎండగట్టేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పిలుపు మేరకు గ్రామ గ్రామాన కాంగ్రెస్ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు.
హరిత విప్లవం, శ్వేత విప్లవం, పంచవర్ష ప్రణాళికలతో దేశాన్ని ఆహార ధాన్యాల్లో స్వయం సమృద్ధిగా ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయీకరణ, ఆర్టీఐ చట్టం, యూజీసీ ఏర్పాటు, ఐఐటీలు, ఐఐఎంల స్థాపన వంటి సంస్కరణలన్నీ కాంగ్రెస్ పాలనలోనే సాధ్యమయ్యాయని చెప్పారు. మహిళా సాధికారత, అంటరానితనం నిర్మూలన, ప్రతి పౌరునికి ఓటు హక్కు వంటి ప్రజాస్వామ్య పునాదులు కాంగ్రెస్ పార్టీ వేసిందన్నారు.
జనవరి 26న జెండా పండుగ
దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ చేసిన సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జనవరి 26న రాష్ట్రవ్యాప్తంగా ‘కాంగ్రెస్ జెండా పండుగ’ నిర్వహించాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని, పార్టీ భావజాలాన్ని వివరించే కరపత్రాలు పంపిణీ చేయాలని సూచించారు. భారత రాజ్యాంగాన్ని అందించిన కాంగ్రెస్ పార్టీ వల్లే దేశంలో శాంతియుత అధికార మార్పిడి సాధ్యమవుతోందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంలోనూ కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, జిల్లా, నగర కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


