రతన్ టాటా సేవలు చిరస్మరణీయం
లాభాలకంటే విలువలకే పెద్దపీట వేసిన మహానుభావుడు
కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్
కొత్తగూడెంలో ఘనంగా 88వ జయంతి వేడుకలు
కాకతీయ, కొత్తగూడెం : ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతరత్న రతన్ టాటా దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ అన్నారు. ఆదివారం కొత్తగూడెంలోని టాటా ఏఐఏ బ్రాంచ్‌లో రతన్ టాటా 88వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ.. రతన్ టాటా వంటి మహోన్నత వ్యక్తి భారతదేశంలో జన్మించడం దేశ ప్రజల అదృష్టమని అన్నారు. కేవలం వ్యాపార రంగంలోనే కాకుండా తన సంపాదనలో సింహభాగాన్ని సేవా కార్యక్రమాలకు అంకితం చేసి కోట్లాది మందికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. లాభాలకంటే విలువలకు ప్రాధాన్యం ఇచ్చిన గొప్ప మానవతావాదిగా రతన్ టాటా నిలిచారని పేర్కొన్నారు.
ప్రపంచస్థాయికి భారత పారిశ్రామిక రంగం
భారత పారిశ్రామిక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో రతన్ టాటా కృషి అనన్యసాధ్యమని డీఎస్పీ తెలిపారు. యువత ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొంది దేశాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. అనంతరం లీడర్ ఝాన్సీ రాణి ఫైనాన్సియల్ సర్వీసెస్ సీఈవో కమల రాణి కొచ్చెర్ల తన టీంతో కలిసి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ రక్తదాతలను అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో లీడర్స్ చందు, ఎండీఆర్‌టీ సామ్రాజ్యం, డేవిడ్ రాజు, ప్రభు, లాల్ బాబు, జ్యోత్స్న, రాకేష్ కాంత్, సురేఖ, టాటా ఏఐఏ బ్రాంచ్ మేనేజర్ జక్కుల సతీష్, బామ్ రాహుల్ వెంకటేష్, లీడర్లు, అడ్వైసర్లు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.


