చంద్రబాబు పాలనలో ప్రజా సేవలు ప్రైవేటు చేతుల్లోకి : పేర్ని నాని
కాకతీయ, అమరావతి : కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పేర్ని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి వైద్యం సహా కీలక రంగాలను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రైవేట్ వ్యక్తులు ప్రజా సేవ కోసం కాకుండా కేవలం వ్యాపార దృష్టితోనే పనిచేస్తారని వ్యాఖ్యానించారు.
ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన వైద్య సేవలను క్రమంగా ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని పేర్ని నాని అన్నారు. ప్రజల ఆరోగ్య సమస్యలు చంద్రబాబుకు పట్టడం లేదని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నా, ఆ దిశగా ఎలాంటి చర్యలు కనిపించడం లేదన్నారు.
పీపీపీ, పీ–4తో ఎవరు లాభపడుతున్నారు?
పీపీపీ, పీ–4 విధానాల పేరుతో ఎవరు బాగుపడ్డారో వారికే తెలుసని పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఈ విధానాలు ప్రజలకు మేలు చేయడం కంటే కొద్దిమంది కార్పొరేట్లకు లాభాలు చేకూర్చేలా ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో 90 పైసలకే 50 కోట్ల విలువైన భూములను కట్టబెడుతున్నారని పేర్ని నాని మండిపడ్డారు. గూగుల్, టీసీఎస్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఇంత చౌకగా భూములు ఎక్కడా తీసుకోలేదని వ్యాఖ్యానించారు. పేదల పేరుతో భూములు దోచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాజధాని ప్రాంత రైతులను సీఆర్‌డీఏ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని పేర్ని నాని అన్నారు. భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ సరైన న్యాయం జరగలేదని, వారి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజా ప్రయోజనాలకంటే కొద్దిమంది ప్రయోజనాలకే చంద్రబాబు ప్రభుత్వం పని చేస్తోందని ఆయన ఆరోపించారు.


