భద్రాద్రి పోలీసుల దూకుడు పనితీరు
ఏడాదిలో 326 మంది మావోయిస్టుల లొంగుబాటు
రూ.30 కోట్లకు పైగా గంజాయి స్వాధీనం
మహిళలపై నేరాల్లో గణనీయ తగ్గుదల
సైబర్ నేరాలపై విస్తృత అవగాహన
వార్షిక నివేదికను వెల్లడించిన ఎస్పీ రోహిత్ రాజ్
కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు సమన్వయంతో పనిచేస్తూ గణనీయ ఫలితాలు సాధిస్తున్నారని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పేర్కొన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన వార్షిక నివేదిక–2025 సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది పోలీస్ పనితీరుకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. జిల్లాలో ఏడాది కాలంలో మొత్తం 326 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఎస్పీ తెలిపారు. ఇది భద్రాద్రి జిల్లాలో శాంతి స్థాపన దిశగా తీసుకున్న కీలక ముందడుగుగా అభివర్ణించారు. అటవీ ప్రాంతాల్లో నిరంతర నిఘా, ప్రజల సహకారం వల్లే ఈ ఫలితం సాధ్యమైందన్నారు.
గంజాయి, నేరాలపై ఉక్కుపాదం
ఈ ఏడాదిలో 70 గంజాయి కేసుల్లో 221 మందిని అరెస్టు చేసి, 5,707 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దాని విలువ సుమారు రూ.28 కోట్ల 54 లక్షలుగా అంచనా వేశారు. ఇందులో భాగంగా సుమారు రూ.22 కోట్ల విలువైన గంజాయిని తగులబెట్టినట్లు వెల్లడించారు. చోరీ కేసుల్లోనూ కోల్పోయిన ఆస్తిలో గణనీయ మొత్తాన్ని రికవరీ చేసినట్లు తెలిపారు. మహిళలపై నేరాలు గత ఏడాదితో పోలిస్తే తగ్గుముఖం పట్టాయని ఎస్పీ తెలిపారు. గతంలో 420 కేసులు నమోదుకాగా, ఈ ఏడాది 384 కేసులు మాత్రమే నమోదయ్యాయని, తద్వారా 8.57 శాతం తగ్గుదల నమోదైందన్నారు. అయితే పోక్సో, ఎస్సీ–ఎస్టీ కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు.
సైబర్ నేరాలపై అవగాహనకు ప్రాధాన్యం
సైబర్ నేరాల నియంత్రణతో పాటు ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృత కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఈ ఏడాది 196 సైబర్ కేసులు నమోదయ్యాయని, రాబోయే రోజుల్లో సైబర్ నేరాల నివారణ, రోడ్డు ప్రమాదాల తగ్గింపు, అక్రమ గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఇల్లందు, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు డీఎస్పీలు, డీసీఆర్బీ, ఎస్బీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


