మున్నేటిలో దూకి యువతి ఆత్మహత్య
ఖమ్మంలో విషాద ఘటన..
మృతురాలి స్వస్థలం ఒడిశా
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం జిల్లా ఏదులారాపురం మున్సిపాలిటీ పరిధిలోని వెంకటగిరి సమీపంలో గల మున్నేటిలో దూకి 17 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం… ఒడిశా రాష్ట్రం కన్యకా సార్ మండలానికి చెందిన దౌతని కుటుంబం ఉపాధి కోసం గత నెల రోజుల క్రితం ఏదులారాపురం మున్సిపాలిటీ పరిధిలోని వెంకటగిరి గ్రామానికి వచ్చి నివాసం ఉంటోంది. శుక్రవారం తెల్లవారుజామున దౌతని కుమార్తె (17) ప్రకాష్ నగర్ సమీపంలోని మున్నేటిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువతి ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రూరల్ సీఐ ముష్కరాజు తెలిపారు. ఈ ఘటనతో వెంకటగిరి ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.


