భార్య గొంతు కోసిన భర్త
ఆత్మకూరులో దారుణం
అనుమానంతో హత్యాయత్నం
బాధితురాలి పరిస్థితి విషమం
కాకతీయ, ఆత్మకూరు : హనుమకొండ జిల్లా ఆత్మకూరులో శుక్రవారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గ్రామంలో కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ఆత్మకూరు గ్రామానికి చెందిన మందా రవి భార్య అనూష సమీపంలోని ఓ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తోంది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య అనుమానాలు, మనస్పర్ధలు తలెత్తడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున మరోసారి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం అనూష నిద్రలో ఉన్న సమయంలో కోపోద్రిక్తుడైన రవి కత్తితో ఆమె గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అనూష కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గమనించి వెంటనే 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అనూష పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు రవిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు.
ఈ ఘటనతో ఆత్మకూరు గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది.


