ఢాకాకు తిరిగొచ్చిన తారిక్ రెహ్మాన్
17 ఏళ్ల విరామానికి తెర.. వేలాదిగా వీధుల్లోకి వచ్చిన బీఎన్‌పీ శ్రేణులు
బుల్లెట్‌ప్రూఫ్ వాహనాల్లో రాజధాని ఢాకాలో భారీ ర్యాలీ
అనారోగ్యంతో ఉన్న తల్లిని పరామర్శించనున్న నేత
ఫిబ్రవరి జరిగే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిత్వ రేసులో తారిక్
ఢాకా : బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) కార్యనిర్వాహక అధ్యక్షుడు తారిక్ రెహ్మాన్ 17 ఏళ్ల స్వయంవాసానంతరం స్వదేశానికి తిరిగొచ్చారు. యూకే నుంచి భార్య జుబైదా రెహ్మాన్, కుమార్తె జైమా రెహ్మాన్‌తో కలిసి గురువారం ఢాకా విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఎన్‌పీ శ్రేణులు వేలాదిగా వీధుల్లోకి వచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. బనానీ ఎయిర్‌పోర్ట్ రోడ్ నుంచి ఢాకా విమానాశ్రయం వరకు పార్టీ నేతలు, కార్యకర్తలు పాదయాత్రగా వెళ్లి తారిక్ రెహ్మాన్‌ను స్వాగతించారు. విమానాశ్రయంలో బీఎన్‌పీ స్టాండింగ్ కమిటీ సభ్యులు ఆయనను స్వాగతించగా, ప్రత్యేకంగా దిగుమతి చేసిన రెండు బుల్లెట్‌ప్రూఫ్ వాహనాల్లో పూర్వాచల్‌లోని ‘300 ఫీట్’ ప్రాంతానికి తరలించారు. మార్గమంతా రోడ్ల ఇరువైపులా పార్టీ శ్రేణులు నిలబడి నినాదాలతో హర్షం వ్యక్తం చేశారు. ఈ సభకు దాదాపు 50 లక్షల మంది హాజరవుతారని పార్టీ అంచనా వేస్తోంది. సభలో ప్రసంగం అనంతరం తారిక్ రెహ్మాన్ అనారోగ్యంతో ఉన్న తల్లి, మాజీ ప్రధాని ఖలేదా జియాను ఎవర్‌కేర్ ఆసుపత్రిలో పరామర్శించనున్నారు. ఆమె నెలకు పైగా అక్కడ చికిత్స పొందుతున్నారు. అనంతరం కుటుంబంతో కలిసి గుల్షన్–2లోని జియా కుటుంబ నివాసం ‘ఫిరోజా’కు వెళ్లనున్నారు. ఈ హైప్రొఫైల్ పర్యటన నేపథ్యంలో ఢాకా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఎన్నికల ముందు.. రాజకీయ ప్రాధాన్యం
షేక్ హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత బీఎన్‌పీ బలపడిన నేపథ్యంలో తారిక్ రెహ్మాన్ తిరుగు ప్రయాణం రాజకీయంగా కీలకంగా మారింది. డిసెంబర్‌లో వెలువడిన అంతర్జాతీయ సర్వేలు బీఎన్‌పీకి అత్యధిక స్థానాలు దక్కే అవకాశముందని సూచిస్తున్నాయి. ఫిబ్రవరిలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో తారిక్ రెహ్మాన్ ప్రధానమంత్రి రేసులో ప్రధాన అభ్యర్థిగా నిలుస్తున్న నేపథ్యంలో ఆయన రాక బంగ్లాదేశ్ రాజకీయాలను కొత్త దిశగా నడిపించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.


