ఆకలికి‘అటల్’ చెక్
ఢిల్లీలో రూ.5కే భోజనం
వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా ప్రారంభం
తొలి విడతలో 45 చోట్ల ప్రారంభమైన అటల్ కాంటీన్లు
రోజుకు రెండు పూటల భోజనం.. ఒక్కో కేంద్రంలో 500 మందికి సేవలు
డిజిటల్ టోకెన్, సీసీటీవీ నిఘాతో పారదర్శక పంపిణీ
కాకతీయ, నేషనల్ డెస్క్ : ఆకలితో అలమటిస్తున్న పేదలు, కూలీలు, తక్కువ ఆదాయ వర్గాలకు భరోసా కల్పించేలా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా ‘అటల్ కాంటీన్’ పథకాన్ని ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రారంభించారు. ఈ పథకం కింద పోషకాహారంతో కూడిన పూర్తి భోజనం కేవలం రూ.5కే అందించనున్నారు. ఈ సందర్భంగా సీఎం రేఖా గుప్తా మాట్లాడుతూ.. “అటల్ కాంటీన్ ఢిల్లీ ఆత్మగా మారుతుంది. ఎవ్వరూ ఆకలితో నిద్రపోకూడదు” అని పేర్కొన్నారు. పేదలకు గౌరవప్రదంగా భోజనం అందించడమే ఈ పథకం లక్ష్యమని వివరించారు.
తొలి దశలో 45 కేంద్రాలు
ప్రస్తుతం ఢిల్లీలో ఆర్కే పురం, జంగ్‌పురా, షాలిమార్ బాగ్, గ్రేటర్ కైలాస్, రాజౌరీ గార్డెన్, నరేలా, బవానా తదితర ప్రాంతాల్లో 45 అటల్ కాంటీన్లు ప్రారంభమయ్యాయి. మిగతా 55 కాంటీన్లను త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ కాంటీన్లలో రోజుకు రెండు పూటల భోజనం అందించనున్నారు. మధ్యాహ్న భోజనం: ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు
రాత్రి భోజనం: సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఒక్కో కేంద్రంలో సుమారు 500 మందికి భోజనం అందించనున్నారు. భోజనంలో బియ్యం, పప్పు, కూరగాయ, చపాతీ, పచ్చడి ఉంటాయి.

డిజిటల్ టోకెన్, సీసీటీవీ నిఘా
భోజన పంపిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం డిజిటల్ టోకెన్ విధానాన్ని అమలు చేస్తోంది. మాన్యువల్ కూపన్లకు బదులుగా ఈ విధానం ఉపయోగించనున్నారు. అలాగే అన్ని కాంటీన్లను డీయూఎస్‌ఐబీ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా సీసీటీవీ కెమెరాలతో ప్రత్యక్ష పర్యవేక్షణ చేస్తారు. మొత్తంగా, పెరుగుతున్న జీవన వ్యయాల మధ్య పేదలకు కడుపు నింపే ఈ పథకం ఢిల్లీలో సామాజిక భద్రతకు కొత్త దిశ చూపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


