డబుల్ ఇండ్ల స్థలాలు కుదరవు
డెస్క్ జర్నలిస్టులకూ అక్రిడిటేషన్లే ఇవ్వాలి
విచారణ అనంతరమే ఇండ్ల స్థలాలపై నిర్ణయం తీసుకోవాలి
టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ తీర్మానం
ఖమ్మం ప్రెస్‌క్లబ్ కమిటీ ఎన్నిక
అధ్యక్షుడిగా దగ్గుపాటి మాధవరావు
కార్యదర్శిగా కాకతీయ స్టాఫర్ నూకల రామచంద్ర మూర్తి
కాకతీయ, ఖమ్మం : జర్నలిస్టులకు డబుల్‌గా ఇండ్ల స్థలాలు కేటాయించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ స్పష్టంగా తీర్మానించింది. ఇప్పటికే ప్రభుత్వం ద్వారా ఒకసారి ఇండ్ల స్థలాలు పొందిన వారు రెండోసారి, మూడోసారి స్థలాలు కావాలంటూ ముందుకు వస్తే ఊరుకోబోమని, పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాతే అధికారులు తుది నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇప్పటివరకు ప్రభుత్వ లబ్ధి పొందని జర్నలిస్టుల పక్షానే తాము నిలుస్తామని టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖదీర్, కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఖమ్మం గాంధీచౌక్‌లోని ఓ హోటల్‌లో బుధవారం నిర్వహించిన టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ సమావేశంలో ఈ మేరకు కీలక తీర్మానాలు చేశారు. టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా 4వ మహాసభలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన హామీ మేరకు 48 గంటల్లోనే అక్రిడిటేషన్లపై జీఓ జారీ కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇదే తరహాలో జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశంపై కూడా కొత్త సంవత్సరంలో ప్రభుత్వం తీపి కబురు అందిస్తుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు.
అర్హులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
ఖమ్మం జిల్లాలో ఇప్పటికే కొందరు జర్నలిస్టులు సొసైటీ, బీపీఎల్ కోటా, జీవో నంబర్ 58, 59 ద్వారా ఇండ్ల స్థలాలు పొందారని, అదే వ్యక్తులు మళ్లీ ముందు వరుసలో నిలవడం అన్యాయమని పేర్కొన్నారు. దశాబ్దాలుగా జర్నలిస్టులుగా పనిచేస్తూ ఇప్పటికీ ప్రభుత్వ లబ్ధికి నోచుకోని అనేక మంది ఉన్నారని, అర్హులైన వారిని గుర్తించి వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి విచారణ చేసి అర్హులను నిర్ణయించాలని డిమాండ్ చేశారు. అక్రిడిటేషన్ల విషయంలోనూ స్పష్టమైన డిమాండ్లు చేశారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలని, రిపోర్టర్లతో సమానంగా డెస్క్ జర్నలిస్టులకూ అక్రిడిటేషన్ కల్పించాలని తీర్మానించారు. డెస్క్ జర్నలిస్టులను వేరుచేసి అక్రిడిటేషన్ బదులు మీడియా కార్డులు మాత్రమే ఇవ్వాలన్న ప్రెస్ అకాడమీ ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని కోరారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు టీడబ్ల్యూజేఎఫ్ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.
ఖమ్మం ప్రెస్‌క్లబ్ కమిటీ ఎన్నిక
సమావేశంలో భాగంగా ఖమ్మం ప్రెస్‌క్లబ్ కమిటీ ఎన్నికలను ఏకగ్రీవంగా నిర్వహించారు. అధ్యక్షుడిగా దగ్గుపాటి మాధవరావు, కార్యదర్శిగా కాకతీయ పత్రిక ఖమ్మం స్టాఫర్ నూకల రామచంద్ర మూర్తి,
కోశాధికారిగా ధనాలకోట రవికుమార్‌లను నియమించారు. ఈసందర్భంగా సీనియర్ జర్నలిస్టులు ప్రసేన్, పారుపల్లి కృష్ణారావు, ఫ్రీలాన్స్ జర్నలిస్టు నాదెళ్ల శ్రీనివాస్‌లను జిల్లా, ఖమ్మం నియోజకవర్గ కమిటీలు ఘనంగా సన్మానించాయి. కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కోశాధికారి తేనె వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు దువ్వా సాగర్, సహాయ కార్యదర్శి జక్కంపూడి కృష్ణ, టీబీజేఏ జిల్లా అధ్యక్షుడు ఆవుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మానుకొండ రవికిరణ్, స్టేట్ కౌన్సిల్ సభ్యులు నలుబోల మధుశ్రీ, బాలకృష్ణతో పాటు వివిధ నియోజకవర్గాల అధ్యక్షులు, కార్యదర్శులు, ఫొటో & వీడియో గ్రాఫర్స్ సంఘ నాయకులు, జిల్లా కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



