పెన్షనర్లకు పెన్షనరీ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి
మార్చి 2024 నుంచి నిలిచిపోయిన పెన్షన్ బెనిఫిట్స్
ప్రభుత్వ నిర్లక్ష్యంతో పెన్షనర్లకు మానసిక క్షోభ
వెంటనే చర్యలు లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
: టా.ప్ర కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్
కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టిన పెన్షనర్లు
కాకతీయ, కరీంనగర్ : మార్చి 2024 నుంచి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయ పెన్షనర్లకు ఇప్పటివరకు పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లించకపోవడం అన్యాయమని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టా.ప్ర) కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని పెన్షనర్లందరికీ బెనిఫిట్స్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంయుక్త కార్యాచరణ సమితి, రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒకరోజు నిరాహార దీక్షలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కోహెడ చంద్రమౌళి అధ్యక్షతన జరిగింది. పెన్షనరీ లాభాలు అందక కోర్టులను ఆశ్రయించిన కొందరికే ఫైర్‌వీ ద్వారా నిధులు మంజూరు చేయడం వల్ల మిగిలిన పెన్షనర్లు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని జనార్దన్ పేర్కొన్నారు. ఈ పరిస్థితులే పెన్షనర్లను మానసిక, శారీరక క్షోభకు గురిచేస్తున్నాయని, కొందరు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పెన్షనర్ల సమస్యలను గుర్తించి, ఎలాంటి ఆలస్యం లేకుండా అందరికీ పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో టా.ప్ర ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరాహార దీక్షలో టా.ప్ర జిల్లా కోశాధికారి ఇరువంటి తిరుమలయ్య, నల్ల ప్రభాకర్ రెడ్డి, అరుకాల చంద్రమౌళి, తుమ్మ పోచ మల్లు, పుల్లెల మల్లయ్య తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు.


