సమిష్టి కృషితోనే సింగరేణి అభివృద్ధి
కార్మికుల భద్రత, సంక్షేమమే ప్రాధాన్యం
సింగరేణి డైరెక్టర్ ఎల్.వి. సూర్యనారాయణ
కాకతీయ, కొత్తగూడెం : సింగరేణి అభివృద్ధి ఒక్క నిర్ణయం వల్ల కాకుండా తరతరాల సమిష్టి కృషి, క్రమశిక్షణ, పరస్పర నమ్మకంతోనే సాధ్యమైందని సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి. సూర్యనారాయణ అన్నారు. మంగళవారం సింగరేణి ప్రధాన కార్యాలయ ఆవరణలో కార్పొరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కార్మికులు, అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది వాతావరణ ప్రభావాలు, సాంకేతిక సవాళ్లు, మార్కెట్ మార్పులు ఉన్నప్పటికీ భద్రతను ముందుంచుకుని అందుబాటులోని వనరులను సమర్థంగా వినియోగిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రతి కార్మికుడు, సూపర్వైజర్, అధికారి చూపిన బాధ్యతాభావం ప్రశంసనీయమన్నారు.
భవిష్యత్తుపై దృష్టి
ఇప్పటివరకు తెలంగాణ అవసరాలకు సేవలందించిన సింగరేణి, మారుతున్న కాలానికి అనుగుణంగా కీలక ఖనిజాలు, అనుబంధ రంగాలు, పునరుత్పాదక శక్తి వంటి విభాగాల్లో అవకాశాలపై ఆలోచన చేస్తోందన్నారు. ఇవి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేపడుతున్న ప్రయత్నాలేనని తెలిపారు.
సింగరేణి బలం ఉత్పత్తిలో కాదు, మనుషుల్లోనే ఉందని స్పష్టం చేశారు. కార్మికుల భద్రత, సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి ఎప్పటికీ ప్రాధాన్యాంశాలేనని పేర్కొన్నారు. మహిళల భాగస్వామ్యం పెరుగుతుండటం సంతోషకరమన్నారు. అనంతరం ఉత్తమ అధికారి, ఉత్తమ ఉద్యోగులను సన్మానించగా, మెయిన్ ఆసుపత్రిలో నిర్వహించిన వెల్ బేబీ షో విజేతలకు బహుమతులు అందజేశారు. జి.ఎం. (పర్సనల్, వెల్ఫేర్, సీఎస్‌ఆర్) జి.వి. కిరణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, యూనియన్ నాయకులు, అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


