ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ తనిఖీ
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌ను అడిషనల్ డీసీపీ (లా & ఆర్డర్) ప్రసాద్ రావు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ నిర్వహణ తీరును, పోలీసుల పనితీరును ఆయన సమగ్రంగా పరిశీలించారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, డయల్–100 కాల్స్‌కు స్పందించిన సమయాలు, పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులు, సస్పెక్ట్ షీట్‌లు, సీసీటీఎన్‌ఎస్‌లో కేసుల అప్లోడ్ స్థితిని పరిశీలించారు. జనరల్ డైరీ, సెక్టార్ అధికారుల విచారణ నివేదికలను తనిఖీ చేసి, పిటిషన్ల విచారణ పురోగతిపై సిబ్బందితో చర్చించారు. ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తూ వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించిన అడిషనల్ డీసీపీ, పోలీస్ స్టేషన్ హౌస్ మేనేజ్‌మెంట్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. బీట్ డ్యూటీ, పెట్రో కార్ సిబ్బంది విధులు, పాత నేరస్తుల కదలికలపై నిఘా విధానం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే వివిధ కేసులకు సంబంధించిన స్వాధీనం చేసుకున్న వాహనాలను పరిశీలించారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, చట్టసంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.


