ప్రజలకు చేసిన సేవలే శాశ్వతం
పారదర్శక పాలనతో ప్రజల మెప్పు పొందాలి
బాధ్యతాయుతంగా పనిచేస్తేనే గుర్తింపు
పేదల సంక్షేమమే లక్ష్యంగా నిర్ణయాలు
గ్రామాభివృద్ధిలో రాజకీయాలకు తావులేదు
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
కాకతీయ, కొత్తగూడెం : ప్రజాప్రతినిధులుగా ప్రజలకు అందించిన సేవలు, చేపట్టిన అభివృద్ధి పనులే శాశ్వతంగా నిలిచిపోతాయని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం మండలంలోని విద్యానగర్ గ్రామపంచాయతీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలు ఎంతో నమ్మకంతో ఎన్నుకున్న పాలకవర్గం ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలని సూచించారు. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కార్యాచరణ రూపొందించాలని కోరారు.
మౌలిక వసతులకే తొలి ప్రాధాన్యత
గ్రామాల్లో తాగునీటి సమస్యల పరిష్కారం, పారిశుధ్యాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కూనంనేని సూచించారు. గ్రామంలో సామాజిక సమతుల్యత, ఐక్యతను కాపాడుకోవడం పాలకవర్గ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయాలనే తపనతో పనిచేస్తేనే ప్రజాప్రతినిధులకు శాశ్వత గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడటంలో పాలకవర్గం క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. గ్రామాభివృద్ధిలో రాజకీయాలకు తావు లేకుండా అందరినీ కలుపుకొని ముందుకు సాగితేనే గ్రామం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, సర్పంచి భూక్య శాంతి శ్రీ, ఉప సర్పంచి వాసిరెడ్డి మురళి, నూతన వార్డు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


