శ్రీ రాగా స్కూల్‌లో ఘనంగా గణిత దినోత్సవం
ప్రత్యేక ఆకర్షణగా విద్యార్థుల మ్యాథ్స్ ఎగ్జిబిట్స్
కాకతీయ, కొత్తగూడెం : శ్రీ రాగా స్కూల్‌లో సోమవారం జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మల్లారపు వర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై, గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులు గణిత ప్రాధాన్యతను వివరిస్తూ రూపొందించిన మోడల్స్, చార్ట్‌లు, మ్యాథ్స్ ఎగ్జిబిట్స్‌ను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వర ప్రసాద్ మాట్లాడుతూ, శ్రీనివాస రామానుజన్ ప్రపంచ గణిత మేధావుల్లో ఒకరని, భారతదేశాన్ని గణితం ద్వారా ప్రపంచ పటంలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన మహనీయుడని కొనియాడారు. గణితం జీవన విధానంలో కీలక పాత్ర పోషిస్తుందని, విద్యార్థులు చిన్ననాటి నుంచే గణితంపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టేలా పాఠశాలలో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
గణితంపై ఆసక్తి పెంచుకోవాలి..!
ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ మల్లారపు కవిత మాట్లాడుతూ, రామానుజన్ గణిత శాస్త్ర పితామహుడని, గణితంలో ఎన్నో అద్భుతాలను సృష్టించిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. విద్యార్థులు గణితంపై ప్రేమ పెంచుకోవాలంటే ఆయన జీవితం, సాధన, అంకితభావాన్ని అధ్యయనం చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మ్యాథ్స్ ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించి బహుమతులు అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన మ్యాథ్స్ ఎగ్జిబిట్స్‌లో ఉత్తమంగా నిలిచిన వాటికి మేనేజ్‌మెంట్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు, గోల్డ్ మెడల్స్ అందించారు. కార్యక్రమానికి జడ్జీలుగా సర్వేశ్వర రావు, రాంబాబు వ్యవహరించారు. ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు సర్వేశ్వర రావు, రాంబాబు, మ్యాథ్స్ ఉపాధ్యాయులు భువన, కవిత, శ్రావణి, శోభారాణి, రమేష్, మోహిత, సుష్మా, సుమా, అనూషా, అన్నపూర్ణతో పాటు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


