మండల స్థాయి టాలెంట్ టెస్ట్‌లో విద్యార్థుల ప్రతిభ
కాకతీయ, జూలూరుపాడు : మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల స్థాయి టాలెంట్ టెస్ట్‌ను నిర్వహించారు. ఈ టాలెంట్ టెస్ట్‌కు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నర్సయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులు మండల స్థాయిలోనే కాకుండా జిల్లా, రాష్ట్ర స్థాయిల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబర్చి తమ పాఠశాలలకు, మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రశ్నాపత్రాన్ని ఆవిష్కరించారు. మండల స్థాయి ప్రతిభా పరీక్షలో ఆంగ్ల మాధ్యమంలో పాపకొల్లు విద్యార్థిని పూజిత ప్రథమ స్థానం సాధించగా, తెలుగు మాధ్యమంలో జూలూరుపాడు ఉన్నత పాఠశాలకు చెందిన ఎం. బన్నీ ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు. విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ టీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతపల్లి ప్రభాకర్ రావు, గణిత ఫోరం మండల అధ్యక్షులు విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, గణిత ఉపాధ్యాయులు రామిశెట్టి శ్రీనివాసరావు, పురుషోత్తం, మంగీలాల్, కేజీబీవీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


