అణువు నుంచి అంతరిక్షం దాకా ..!
బాల సైంటిస్టుల వినూత్న ఆవిష్కరణలు
సృజనాత్మకతకు వేదికగా ‘స్మార్ట్ కిడ్జ్ ఇన్స్పైర్–2025’
200కి పైగా సైన్స్ నమూనాలతో అలరించిన విద్యార్థులు
కాకతీయ, ఖమ్మం : భవిష్యత్ శాస్త్రవేత్తలకు బాట వేసేలా స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో నిర్వహించిన ‘ఇన్స్పైర్–2025’ సైన్స్ ఎగ్జిబిషన్ సృజనాత్మకతకు ప్రతీకగా నిలిచింది. పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య పర్యవేక్షణలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో బాల సైంటిస్టులు ప్రదర్శించిన వినూత్న సైన్స్ నమూనాలు అందరినీ అబ్బురపరిచాయి. భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, ఆరోగ్యం, రవాణా, అంతరిక్షం, సూర్య కుటుంబం, ప్రజల జీవన విధానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోలార్ ఎనర్జీ, గ్లోబల్ వార్మింగ్, నదులు–అడవుల పరిరక్షణ వంటి విభాగాల్లో 200కి పైగా సైన్స్ నమూనాలను విద్యార్థులు ప్రదర్శించారు. తమ ఎగ్జిబిట్ల వివరాలను విద్యార్థులు ఆంగ్లంలో అనర్గళంగా వివరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఆకట్టుకున్న ప్రత్యేక నమూనాలు
హైడ్రో ఎలక్ట్రిక్ ఎనర్జీ (చింతనిప్పు అభయ్ కృష్ణ), కార్బన్ ప్యూరిఫికేషన్ (ఎం. కార్తికేయ), రైన్ డిటెక్టర్ (జి. ఆద్య), వేస్ట్ మేనేజ్‌మెంట్ (పి. పవిత్ర), థర్మల్ పవర్ స్టేషన్ (పి. ప్రణీత శ్రీ), సాటిలైట్ కమ్యూనికేషన్ (హెచ్. యశస్విని), న్యూక్లియర్ పవర్ ప్లాంట్ (టి. మనీష్), ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్ (బి. రుత్విక్), హైడ్రోపోనిక్స్ (కే. క్రాంతి సుదీక్ష), స్మార్ట్ అగ్రికల్చర్ (బి. పునర్వి), గ్లోబల్ వార్మింగ్ (బి. విశ్వకార్తిక్), వాటర్ కన్జర్వేషన్ (ఆర్. మోక్షిత్ కృష్ణ), సోలార్ సిస్టం (ఎం. దియా), డ్రిప్ ఇరిగేషన్ (వి. నిహిత్ కుమార్), నేచురల్ క్లైమేటీస్ (ఎన్. జస్విన్ ప్రసాద్), రైన్ వాటర్ హార్వెస్టింగ్ (డి. వేదాంశ), స్మార్ట్ సిటీ (ఎం. ప్రణవ్) తదితర నమూనాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇన్స్పైర్ ప్రారంభించిన తుమ్మల యుగంధర్
ఈ సైన్స్ ఇన్స్పైర్‌ను యువనేత, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు భవిష్యత్తులో సైంటిస్టులుగా ఎదిగి సమాజానికి సేవలందించాలని ఆకాంక్షించారు. చిన్నారుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ, గత 13 సంవత్సరాలుగా స్మార్ట్ కిడ్జ్‌లో సైన్స్ ఇన్స్పైర్ నిర్వహిస్తున్నామని, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మోతారపు శ్రావణి సుధాకర్, పైడిపల్లి సత్యనారాయణ, పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో హాజరైన తల్లిదండ్రులు, ప్రజలు బాల సైంటిస్టులను అభినందించారు.


