అప్రమత్తతతోనే సైబర్ మోసాలకు బ్రేక్
వ్యక్తిగత వివరాలు బయటపెడితే ప్రమాదమే
అనుమానాస్పద లింక్‌లకు దూరంగా ఉండాలి
ఆన్‌లైన్ గేమింగ్‌లో మోసాలు పెరుగుతున్నాయి
సైబర్ అవగాహన విస్తృతంగా కల్పించాలి
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి సైబర్ నేరాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సైబర్ క్రైమ్ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్‌లో నిర్వహించిన సైబర్ క్రైమ్ నియంత్రణపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బహుమతులు, రుణాలు, డిస్కౌంట్లు అంటూ వచ్చే అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దని, బ్యాంకు పేరుతో కాల్ చేసే మోసగాళ్లకు ఓటీపీ, ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వొద్దని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ గేమింగ్‌లో చదువుకున్నవారే ఎక్కువగా మోసపోతున్నారని, షాపింగ్ సమయంలో ఫోన్ నెంబర్, ఆధార్ వంటి వివరాలు ఇవ్వడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఫోన్‌నే బ్యాంకుగా మారిన ఈ రోజుల్లో పాస్‌వర్డ్‌లను తరచూ మార్చుకోవాలని, సులభమైన పాస్‌వర్డ్‌లు వాడొద్దని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబ సభ్యులు, పరిసర ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సైబర్ క్రైమ్ అడిషనల్ ఎస్పీ జి. బిక్షం రెడ్డి, డీఎస్పీ సీహెచ్.ఆర్.వి. ఫణీందర్, సీఐ కే. నరేష్, డీఆర్‌ఓ ఏ. పద్మశ్రీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు


