లంచానికి చేయి చాచిన ఆర్‌ఐ…
వల పన్ని పట్టకున్న ఏసీబీ
కారేపల్లిలో రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్
ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీకి లంచం డిమాండ్
ఆర్ ఐ ఇంట్లోనూ ఏసీబీ సోదాలు
కాకతీయ, ఖమ్మం : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) దౌలూరి శుభకామేశ్వరి దేవి ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ కోసం రూ.10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను పట్టుకున్నారు. డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో ఏసీబీ బృందం పక్కా సమాచారంతో దాడి చేసి ఆర్‌ఐను అరెస్ట్ చేసింది. కారేపల్లిలోని ఆమె నివాసం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుడి నుంచి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీకి లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు వల వేసిన అధికారులు, నిర్ణీత సమయంలో లంచం తీసుకుంటున్న వేళ ఆర్‌ఐను పట్టుకున్నారు.
ఇంట్లో సోదాలు… పాత ఆరోపణలు
అరెస్ట్ అనంతరం ఆర్‌ఐ శుభకామేశ్వరి దేవి ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆమెపై గతంలోనూ లంచం తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.


